కాసిపేట, జూన్ 18 : దేశాన్ని రక్షించే ఆర్మీని కూడా ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. శనివారం కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలోని నాయకపుగూడ సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాన్ని పరిశీలించి సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడా మైదానం వద్ద మొక్కలను నాటారు. దేవాపూర్ గ్రామ పంచాయతీ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానంచి వారి సేవలను కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోదీ అనుచరుడైన అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు.
ప్రజల పక్షాన ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. అనంతరం దేవాపూర్ జడ్పీఎస్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని, మంచి స్థానంలో గౌరవం ఉండాలంటే చదువు ఒకటే మార్గమని ప్రతి విద్యార్థీ కష్టపడి చదవాలన్నారు. మండల పరిషత్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రమ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఎంపీడీవో ఎంఏ అలీం, మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య, మడావి అనంతరావు, సర్పంచ్‌లు ఆడె బాదు, ఆడె జంగు, అజ్మీరా తిరుపతి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, పద్మ, కార్యదర్శి కవిత, సర్పంచ్‌లు కటకం రవీందర్, బోయిని తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వాస్దేవ్, మంజులారెడ్డి, అట్టెపల్లి శ్రీనివాస్, బింగి శ్రీనివాస్, జాడి రాంచందర్, కైలాస్, రాందాస్ పాల్గొన్నారు.
సరదాగా కాసేపు..వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే..
ప్రజా సేవలో బిజీగా ఉండే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాసేపు సరదాగా వాలీబాల్‌ను ఒక పట్టు పట్టారు. కాసిపేట మండలంలోని దేవాపూర్ క్రీడా మైదానాన్ని ప్రారంభించేందుకు వచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కార్యక్రమ అనంతరం సరదాగా కాసేపు స్థానికులతో వాలీబాల్ కోర్టులో ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు.
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
బెల్లంపల్లిరూరల్, జూన్ 18: ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ఉంటూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం మండలంలోని దుగినేపల్లిలో రూ.1.50 కోట్లు డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రెండు నెలల్లో గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. పార్టీలకతీతంగా ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో అర్హులైన దళితులను గుర్తించి దళితబంధు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి అర్హులను గ్రామస్తులే గుర్తించాలని, వారికే ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం దశల వారీగా దళితులను గుర్తించి అందరికీ దళితబంధు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చదువుకున్న నిరుద్యోగ దళిత యువకులకు దళితబంధు పథకంలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇండ్లు కట్టుకోవడంతో పాటు, భూమిని కొనుగోలు చేసుకోవడానికి కూడా దళితబంధు పథకాన్ని వినియోగించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపినట్లు చెప్పారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో సంక్షేమ పథకాల ఊసే లేదన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో సుఖ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షుడు సింగం గణేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎం రాజశేఖర్, సర్పంచ్ డోలె సురేశ్, ఎంపీటీసీ శకుంతల, ఎంపీడీవో డీ రాజేందర్, ఎంపీవో వీ శ్రీనివాస్, ఏపీవో జీనత్, సర్పంచ్‌లు అశోక్‌గౌడ్, గుర్రాల రాయమల్లు, వేముల కృష్ణమూర్తి, కారుకూరి వెంకటేశ్, ఎంపీటీసీ పీ సుభాష్‌రావు, టీఆర్ఎస్ నాయకులు కొమ్మెర లక్ష్మణ్, జిల్లపల్లి వెంకటస్వామి, రామగోని అశోక్‌గౌడ్, వెంబడి సురేశ్, జుమ్మిడి బానయ్య, దుర్గం స్వామితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.