కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నేండ్లుగా మావోయిస్టుల అలికిడి వినిపించక ప్రశాంతంగా ఉంది. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టు సానుభూతి పరులు దళాల్లో చేరేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రాణహిత పరీవాహక, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలపై నిఘా పెట్టారు. అడవులను జల్లెడ పడుతున్నారు. ఎస్పీ సురేశ్‌కుమార్, ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, పోలీసు సిబ్బంది మారుమూల ప్రాంతాలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యువత సన్మార్గంలో పయనించాలని, దేనికి ఆకర్షితులు కాకూడదని, సర్కారు పథకాలను సద్వినియోగం చేసుకొని జీవితాన్ని బాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, కొత్త వారిపై నిఘా పెంచినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధాలు కలిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
కౌటాల మండలంలోని గుండాయిపేట, తు మ్మిడిహట్టి గ్రామాలకు చెందిన కొందరు సానుభూతిపరులు ఇటీవల మావోయిస్టుల్లో చేరేందుకు వెళ్లడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై అప్రమత్తమైన పో లీసులు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలపై నిఘా పెట్టారు. 2020 సెప్టెంబర్ 20న కడంబలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమైన తర్వాత అలికిడి తగ్గింది. తాజాగా మళ్లీ కదలికలు రావడంతో కలవరం మొదలైంది. కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే సమాచారం ఇవ్వాలని, మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందించవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
మావోయిస్టుల్లో చేరొద్దని అవగాహన
ఇటీవల ఎస్పీ సురేశ్‌కుమార్, ఏఎస్పీ అచ్చేశ్వర్రావు మారుమూల ప్రాంతాలైన దహెగాం, పెంచికల్పేట్ మండలాల్లోని మొట్లగూడ, ఖర్జీ, రాంపూర్, శంకరపురం, రావులపల్లి, నందిగామ, మోర్లిగూడ, జల్లెడ, కమ్మరగావ్, గుండేపల్లి గ్రామాలను సందర్శించారు. ప్రజలు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించా రు. మావోయిస్టుల్లో చేరవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని, అమాయక గిరిజనులు, యువత మావోయిస్టులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా రు. శనివారం కాగజ్‌నగర్ సీఐ నాగరాజు 50 మంది పోలీసులతో దహెగాం మండలంలోని ఖర్జీ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, యువత వ్యవసానాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి
వేమనపల్లి, జూన్ 18 : గ్రామాల్లో ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని నీల్వాయి ఎస్ఐ నరేశ్ సూచించారు. ప్రాణహిత పరిసర ప్రాంతాలు జాజులపేట, ఒడ్డుగూడెం, కల్లెంపల్లి పరిసర ప్రాంతాలను శనివారం పరిశీలించారు. ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రభావం ఉందని, గ్రామాల్లోకి నది దాటి ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. సర్పంచ్ కొండగొర్ల బాపు, గ్రామస్తులు సీఆర్పీఎఫ్ , సివిల్ పోలీసులు పాల్గొన్నారు.