మంచిర్యాల ఏసీసీ, జూన్ 13 : గోదానం, భూదానం, అన్నదానాలకే పురాణాల్లో ప్రాధాన్యం ఉంది. వాటివల్ల పుణ్యం లభిస్తుందని ప్రజల విశ్వాసం. కానీ ఆధునిక కాలంలో రక్తదానాన్ని మించిన దానం లేదు. రక్తదానంతో మృత్యుముఖం నుంచి బయటపడిన వారు తెలిపే కృతజ్ఞతతో పొందే సంతృప్తి వెలకట్టలేనిది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఏటా 40 లక్షల యూనిట్లు మాత్రమే..
రక్తాన్ని తయారు చేయలేం. కానీ శరీరంలో ఉత్పత్తి అయ్యే రక్తాన్ని దానం చేయడం ద్వారా ఓ నిండు ప్రాణా న్ని కాపాడవచ్చు. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఆశించిన ఫలితాలు రా వడం లేదు. దేశ వ్యాప్తంగా ఏటా 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుండగా, 40 లక్షల యూనిట్లు మాత్రమే దొరుకుతుంది. దేశ జనాభాలో 50 శాతం మంది రక్తదా నం చేయడానికి అర్హులే. అయితే ప్రతి వెయ్యి మందిలో నలుగురే రక్తదానం చేస్తున్నారని అంచనా. దీంతో 70 శా తం మంది రక్తం దొరకక చనిపోతున్నారు. ఇక మహిళలైతే మొత్తం రక్తదానం చేసిన వారిలో ఆరుశాతం ఉన్నారని అంచనా. ఇక మన జిల్లాలో ఆ స్థాయిలో కూడా లేరు. ఈ పరిస్థితికి కారణం అవగాహన రాహిత్యమే. ప్రధానంగా యువతలో చైతన్యం వస్తేనే కొరతను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లాలో 5 లక్షల పై చిలుకు జనాభా ఉంది. రోడ్డు ప్రమాదాలు, రక్తహీనత బాధితుల సంఖ్య పెరగడంతో ఏడాదికి 12 వేల యూనిట్ల నుంచి 15 వేల యూనిట్ల వరకు రక్తం అవసరమవుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏడాదికి 700 యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తున్నారు. జిల్లాలో ఉన్న జనాభాను బట్టి ఒక్క శాతం రక్తదానం చేసినా.. ఏడాదికి 5000 యూనిట్ల రక్తాన్ని సేకరించగలుగుతారు. కానీ ప్రజల్లో అంత చైతన్యం కలగడంలేదు. ఏప్రిల్ 1, 2021 నుంచి ఈ ఏడాది మార్చి 30 నాటికి కేవలం 7,780 యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలిగారు. ఏడాదికి గరిష్ఠంగా 7000ల పై చిలుకు యూనిట్ల మాత్రమే రక్తం సేకరిస్తున్నారు.
దినోత్సవం వచ్చిందిలా…
అన్ని దేశాల్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని యేటా జూన్ 14న నిర్వహిస్తున్నారు. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి నాడు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తొలిసారి 2004లో ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహించారు.
18 ఏళ్లు నిండిన వారంతా..
18 నుంచి 55 ఏళ్లలోపు వారంతా రక్తదానం చేయవచ్చు. కనీసం 50 కిలోల బరువు ఉండాలి. రోజుకు మనిషిలో 15ఎం.ఎల్ రక్తం ఉత్పత్తి అవుతుంది. వీటిలో 90 రోజులకోసారి 300 ఎం.ఎల్ రక్తాన్ని దానం చేయొచ్చు. ఏడాదిలో గరిష్ఠంగా నాలుగుసార్లు రక్తదానం చేయొచ్చు. కొత్త రక్తకణాలు మూడు నుంచి నాలుగు వారాల్లో ఏర్పడుతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఆహారం, విశ్రాంతి అవసరం లేదు. రక్తశాతం పెరగాలంటే ఆకుకూరలు, పప్పులు, వేరుశనగ, బెల్లం, తియ్యని పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, క్యారెట్, బీట్రూట్, అంజీరా తీసుకోవాలి. రక్తదానం చేసే వ్యక్తి 12గంటల ముందు, తరువాత ఆల్కహాల్ తీసుకోకూడదు.
కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు, ఇతర శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారు కొన్ని రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు. తీవ్రమైన వ్యాధులు, మూర్చ, మూత్రపిండాల వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తశ్రావం లక్షణాలు, త్వరితగతిన బరువు కోల్పోవడం, గుండె సంబంధిత వ్యాధులు లేని వారి నుంచి రక్తం సేకరించాలి. అపోహలు వీడాలి రక్తాన్ని సేకరించేటప్పుడు వాడే సూదులు నొప్పి పెడుతాయని, మళ్లీ వినియోగిస్తుంటారని చాలా మంది భావిస్తుంటారు. అయితే రక్తాన్ని సేకరించే సూది, ట్యూబ్, బ్యాగ్ మూడూ కలిపి ఉండే ఒకే కిట్‌ను ఒకసారి వినియోగించాక మళ్లీ వాడరు. మరికొందరు రక్తాన్ని చూస్తే భయపడుతారు. అందుకు ముందుకు రారు. కానీ రక్తం చూడాల్సిన అవసరం లేకుండానే వైద్యుల సమక్షంలో దానం చేయవచ్చు.
రెడ్ క్రాస్ రక్తనిధి సేవలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో డిసెంబర్ 8, 2008 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 81,660 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దాదాపు ఆపదలో ఉన్నవారికి అందజేశారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సేరకించిన రక్తంలో 60 శాతం ప్రభుత్వ దవాఖానకు, తలసేమియా, సెకిల్సెల్ వ్యాధిగ్రస్తులకు అందజేశారు.
రక్తం కావాలానుకునే వారు…
ఆపదలో ఉన్నవారు రక్తం కావాల్సి వస్తే జిల్లా కేంద్రంలోని రక్త నిధి కేంద్రానికి నేరుగా గాని, ఫోన్ ద్వారా గాని సంప్రదించవచ్చు. రోగికి అవసరమైన గ్రూప్ అడిగి తీసుకోవాలి. ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ రక్తం అవసరమైతే ఉచితంగా ఇస్తారు. ప్రైవేట్ దవాఖానల్లో ఉన్న రోగులకు ప్రాసెసింగ్ చార్జీలుగా రూ.1050 చెల్లించాలి. రక్తదాత రక్తం ఇస్తే రూ.900 తీసుకొని అవసరమైన బ్లడ్‌ను అందజేస్తారు. రక్తనిధి కేంద్రం ఫోన్ నెంబర్ 08736 259259, చైర్మన్ కంకనాల భాస్కర్ నంబర్లకు సంప్రదించవచ్చును.
43 సార్లు రక్తదానం
రక్తంలో అరుదైన గ్రూప్ ఏ-బీ నెగిటివ్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంస్థల ప్రతినిధి వీ.మధుసూదన్ది ఆ గ్రూపే. ఇప్పటికీ 43 సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చేశారు. అనేకసార్లు కలెక్టర్లు, రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రశంస పత్రాలు, అవార్డులు అందుకున్నారు. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా, సెకిల్సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రక్తాన్ని అందిస్తున్నారు.