ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టడం.. రెండు రోజులుగా వాతావరణం చల్లబడడంతో చిన్నారులు బడులకు వడివడిగా అడుగులు వేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పండుగ వాతావరణం నెలకొంది. బడులను మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించారు. తొలి రోజు కావడంతో విద్యార్థులకు పెన్నులు, కంపాక్స్ బాక్సులు, బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. కొందరు అడ్మిషన్లు కూడా తీసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పాఠశాలలను అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సందర్శించారు. కొంతసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
నిర్మల్ అర్బన్, జూన్ 13 :ఎట్టకేలకు రెండేండ్ల తర్వాత బడి గంట మోగింది. కొవిడ్ కారణంగా ఓ ఏడాదంతా మూసివేయగా, గతేడాది ఆలస్యంగా తరగతులు ప్రారంభించారు. తాజాగా కొవిడ్ వ్యాప్తి, కేసులు తగ్గిన నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం జూన్‌లోనే బడిగంట మోగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో పాఠశాలలు ప్రారంభం అవుతాయో లేదోనని ఒకింత ఆందోళన చెందగా ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్‌తో పకడ్బందీగా బడులను ప్రారంభించడం గమనార్హం.సోమవారం తొలి రోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరాగా, ప్రైవేటు పాఠశాలల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే నమోదైంది.
పండుగ వాతావరణంలో ప్రారంభం..
విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. లక్ష్మణచాంద మండలం వడ్యాల్ పాఠశాల ఉపాధ్యాయులు నూతనంగా చేరిన విద్యార్థులతో పాటు బడికి వచ్చిన పిల్లలకు పుష్ప గుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. జిల్లా అంతటా అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఆహ్వానం పలికారు. జిల్లాలో 834 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా తొలిరోజు 60 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు.
మన ఊరు మన బడితో కొత్త కళ..
మన ఊరు మన బడి కార్యక్రమం ఫలితంగా సర్కారు పాఠశాలలు కొత్త కళను సంతరించుకున్నాయి. 1నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రారంభించడంతో సర్కారు బడులు విద్యార్థులతో కిటకిటలాడనున్నాయి. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎక్కువగా ఉంటాయని ఉపాధ్యాయులు చెప్తున్నారు.
సందర్శించిన మంత్రి, కలెక్టర్…
పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం రాంపూర్‌లోని ప్రాథమిక, అంగన్వాడీ పాఠశాలలను, దర్యాపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. కొంత సేపు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్థులు నైపుణ్యాలను మంత్రి పరీక్షించారు. తరగతి గదులను పరిశీలించారు. అలాగే కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాఠశాలలను పరిశీలించారు.