నిర్మల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) :వానకాలం పంటల సాగుకు రైతాంగం సమాయత్తమవుతున్నది. ఇప్పటికే తొలకరి జల్లులు మొదలవడంతో పంట చేలవైపు దృష్టి పెడుతున్నది. కాగా, వ్యవసాయ శాఖ.. సాగు ప్రణాళికను ఖరారు చేసి, పంటల లక్ష్యాన్ని నిర్ణయించింది. రుణాల ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. దీనికి తోడు పంటల సాగుకు అవసరమయ్యే వివిధ రకాల విత్తనాలను సంబంధిత యంత్రాంగం అందుబాటులో ఉంచింది. కాగా జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సారి పత్తికే రైతాంగం ప్రాధాన్యమిస్తున్నది.
వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగానికి వ్యవసాయశాఖ దన్నుగా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, కంది, పెసర, మినుము తదితర విత్తనాలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే రైతులకు సరిపోయేన్ని (పత్తి, సోయా) విత్తనాలను అందుబాటులో ఉంచారు. నిర్మల్ జిల్లాలో మొత్తం ఈ సీజన్‌కు గాను 4 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో నుంచి 1.61 లక్షల ఎకరాల్లో పత్తి, 1.17 లక్షల ఎకరాల్లో వరి, 82 వేల ఎకరాల్లో సోయా, 23 వేల ఎకరాల్లో మక్క, 17వేల ఎకరాల్లో కందులు సాగుచేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ సారి వరి సాగును తగ్గించాలన్న లక్ష్యంతో పత్తి వైపు రైతులను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఒకేసారి పత్తి దిగుబడి వచ్చే వెరైటీ రకం విత్తనాలను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. దీనికి తోడుగా ఆయిల్‌పాం కూడా ప్రత్యామ్నాయ పంటగా సాగుచేయాలని తలపెట్టారు. ఇప్పటికే దాదాపు 7 వేల ఎకరాల్లో అయిల్‌పాం పంటల సాగుకు రైతులు సిద్ధమవడమే కాకుండా కొన్నిచోట్ల ఈ పంట సాగును కూడా మొదలుపెట్టారు. కాగా, ఈ సారి జిల్లాకు అవసరమయ్యే యూరియాతో పాటు, కాంప్లెక్స్ ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచబోతున్నారు. జిల్లాకు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 16 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 4 వేల మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
పంపిణీకి సిద్ధంగా విత్తనాలు..
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా విత్తనాలను విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 సహకార సంఘాలు ఉండగా, వీటి ద్వారా విక్రయించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. వరిలో ఎంటీవీ-1010, జేజీఎల్-24423, ఎంటీయూ-1001, కేఎన్ఎం-118 మొదలగు రకాలు (25 కేజీల బస్తాలు) అందుబాటులో ఉన్నాయి. బస్తా ధర రూ.850. అలాగే కంది విత్తనాలు ఎల్‌ఆర్‌జీ-176, ఐసీపీఎల్-87119(1 ఆశ) 2 కిలోల బస్తాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. బస్తా ధర రూ.200. అలాగే పెసర ఎంజీజీ-295 రకం 2 కిలోల బస్తా ధర రూ.209. మినుములు పీయు-31 రకం 4 కేజీ బస్తా ధర రూ.409గా నిర్ణయించారు. రైతులు తమ సమీపంలోని సహకార సంఘాలను సంప్రదించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ఖరారైన రుణ ప్రణాళిక…
ఈ సారి పంట రుణ ప్రణాళికను సంబంధిత బ్యాంకు అధికారులతో కలిసి కలెక్టర్ ఖరారు చేశారు. మొత్తం వార్షిక రుణ ప్రణాళిక రూ.3,974.93 కోట్లు కాగా, ఇందులో నుంచి వ్యవసాయ రంగానికి రూ.3,085.31 కోట్లు అందించాలని నిర్ణయించారు. గతేడాది 70 శాతం రుణ లక్ష్యాన్ని సాధించగా, ఈ సారి రైతులకు వంద శాతం రుణాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, గతేడాది 1,34,266 మంది రైతులు పంట రుణాలను తీసుకోగా, ఇప్పటి వరకు 1.13 లక్షల మంది రెన్యూవల్ చేసుకున్నట్లు లీడ్ బ్యాంకు అధికారులు తెలిపారు. మరో 20వేల మంది రెన్యూవల్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.
లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే కొనాలి
రైతులు విత్తనాలు, ఎరువులు కచ్చితంగా లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనాలి. ఇందుకు సంబంధించిన రసీదు, బస్తాపై ఉన్న బ్యాచ్ నంబర్‌ను తీసుకొని భద్రపర్చుకోవాలి. బస్తాపై గడువు తేదీని ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వతే కొనాలి. బహిరంగ మార్కెట్లో నకిలీ విత్తనాలు, ఎరువులపై ఎలాంటి అనుమానం వచ్చినా… వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తేవాలి. తెలంగాణ విత్తనాభివృధ్ధి సంస్థ ద్వారా నాణ్యమైన, సర్టిఫైడ్ విత్తనాలైన వరి, కంది, పెసర, మినుములు అందుబాటులో ఉన్నాయి. వీటిని సహకార సంఘాల ద్వారా విక్రయిస్తున్నాం. ఈ విత్తనాలను రైతులు వినియోగిస్తే నష్టపోయే పరిస్థితి ఉండదు.
– అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి