మంచిర్యాలటౌన్, జూన్ 12: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 30, 34, 35 వార్డుల్లో చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 35వ వార్డు ఇక్బాల్ అహ్మద్ నగర్లో చాలా కాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రజలు చైర్మన్ పెంట రాజయ్యను, కమిషనర్ బాలకృష్ణను కోరారు. డ్రైనేజీ పూడిక తీయడం లేదని, తరచూ పూడిక పెరిగిపోయి దుర్వాసన వెదజల్లుతున్నదని, అలా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారాన్ని చెత్త బండికి ఇవ్వడం, తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, మాదంశెట్టి సత్యనారాయణ, చంద్రశేఖర్ హండే, గౌసొద్దీన్, షఫియుద్దీన్, మినాజ్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్‌లో పట్టణంలో ..
చెన్నూర్, జూన్ 12: చెన్నూర్ పట్టణంలో ప్రట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో ఆదివారం కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పర్యటించారు. వార్డుల్లోని పలు సమస్యలను గుర్తించారు. మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేసి పారిశుధ్య పనులు చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించి, వీధి దీపాలను ఏర్పాటు చేశారు.
జైపూర్ మండలంలో..
జైపూర్, జూన్ 12: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం మండలంలోని నర్సింగాపూర్, శెట్పల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలను ఎంపీడీవో సత్యనారాయణ పరిశీలించారు. పారిశుధ్య పనులు పరిశీలించి తగు సూచనలు చేశారు. శెట్పల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి మొక్కలు ఎండి పోకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు మేడి రవి, పండుగ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..కోటపల్లి, జూన్ 12 : కోటపల్లి మండలంలో పల్లె ప్రగతి కొనసాగుతున్నది. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోటపల్లి మండలంలోని రాంపూర్‌లో పారిశుధ్య పనులను సర్పంచ్‌పల్లి భారతి, రాజారాంలో సర్పంచ్ కొంక పోషక్క, ఉప సర్పంచ్ తిరుపతి రావు, సూపాక గ్రామంలో సర్పంచ్ కాశెట్టి సతీశ్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు.
జేసీబీ వచ్చే చింత చీరే..పల్లె ప్రగతి పనులు చకచకా సాగేందుకు గ్రామాల్లో జేసీబీలను వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద మురుగుకాలువల్లో పూడిక తీత, పాడు బడ్డ ఇండ్లు, బావులను పూడ్చి వేసేందుకు జేసీబీలను వాడుతున్నారు. కోటపల్లి, పారుపల్లిలో పారిశుధ్య పనులకు జేసీబీని వాడారు.