మంచిర్యాల, జూన్ 12(నమస్తే తెలంగాణ) : పట్టణాల్లో పార్కుల మాదిరిగా పల్లెల్లోనూ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించి, ఊరూరా ఏర్పాటు చేయించింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో పేర్కొన్నట్లు పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో గ్రీన్ బడ్జెట్ కింద ఖర్చు చేసే 10 శాతం నిధులను వీటికి ఉపయోగించారు. ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీల్లో నిధులు ఖర్చు చేశారు. ఫలితంగా గ్రామాల్లో ప్రకృతి వనాలు పచ్చగా దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని హంగులతో పంచాయతీకో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు.
పార్కును తలపించే ప్రకృతి వనంలో చిన్నారులు ఆడుకునేలా వస్తువులు, కూర్చునే బెంచీలు, తదితర ఏర్పాట్లు కూడా చేశారు. గ్రామాల్లో సహజంగా కనిపించే ప్రకృతి సౌందర్యానికి మరింత అందాలను తీసుకవచ్చేందుకు ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్కులు పల్లె ప్రజలకూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జిల్లాలో 310 పంచాయతీలు ఉండగా, అన్ని జీపీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఏడో విడుత తెలంగాణకు హరితహారం లక్ష్యంలో భాగంగా జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 548 పల్లె ప్రకృతి వనాలు ఉండగా, వాటిలో 11.40 లక్షల మొక్కలు ఉన్నాయి.
కాలుష్యం తగ్గిస్తూ.. జీవ వైవిధ్యం కాపాడుతూ..
ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. మంచిర్యాల జిల్లాలో వంద శాతం ప్రకృతి వనాలు పూర్తయ్యాయి. అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటు చేసి, రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులతో పూర్తిచేశారు. 4-5 వేల మొక్కలు నాటి చిట్టడవిలా తయారు చేశారు. అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించారు. వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఆహ్లాదాన్ని నింపేలా, సేద తీరేలా పండ్లు, సుందరీకరణ మొక్కలు, నీడనిచ్చే చెట్లు వంటి నాలుగు రకాలైన మొక్కలను పెంచుతున్నారు. పంచాయత్ రాజ్ నిధులతో ద్వారం, కమాన్, పల్లె ప్రకృతి వనం చుట్టూ కంచెలను, నడకకు ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేశారు. కూర్చునేందుకు ప్లాట్‌ఫాంలు నిర్మించారు. వాకింగ్ ట్రాక్‌ల పక్కన వేప, మర్రి, కానుగ, బాదం, దానిమ్మ, సీతాఫలం, నేరెడు, తదితర పండ్ల మొక్కలు పెంచుతున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు పరికరాలు సైతం అందుబాటులో ఉన్నాయి. పల్లె ప్రకృతి వనాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రశాంతతకు నిలయాలుగా మారాయి.
ఆహ్లాదం.. ఆరోగ్యం..
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ప్రకృతి వనాలు రూపుదిద్దుకున్నాయి. పట్టణాల తరహాలో పార్కులను తలపిస్తూ, గ్రామీణులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, సంకల్ప బలంతో ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. పల్లెలు ప్రగతిబాట పట్టాయి. రూపాంతరం చెంది రూపురేఖలు మారిపోయాయి. వసతులన్నీ సమకూరాయి. పల్లెపల్లెనా మొక్కలతో పచ్చని పార్కులు దర్శనమిస్తున్నాయి. అందులో కూర్చునేందుకు కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. దీంతో చిన్నాపెద్ద ఉత్సాహంగా ప్రకృతివనాలకు వచ్చి, సేదతీరుతున్నారు.