లక్షెట్టిపేట రూరల్, జూన్ 12 : తెలంగాణ సర్కారు ప్రజా ఆమోదంతో పారదర్శక పాలన అందిస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపలపల్లి, ఏడు, ఎనిమిదో వార్డుల్లో పర్యటించారు.
ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఐదో వార్డులోని వీకర్స్ సెక్షన్ కాలనీలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆ తర్వాత టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన లక్షెట్టిపేట నుంచి మినీ ట్యాంక్ బండ్ మీదుగా ఇటిక్యాల వెళ్లే బీటీ రహదారిని స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోగా రూ.18 కోట్లతో లక్షెట్టిపేట మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా పట్టణంలో 80 శాతం ప్రజలకు తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే మినీ ట్యాంకు బండ్‌ను అభివృద్ధి చేశామని, ఇప్పుడు బీటీ రోడ్డును వేశామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్‌లు, క్రీడా మైదానాలు, పట్టణ బృహత్ ప్రకృతి వనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రూ. 3.90 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వ దవాఖానకు నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు పట్టణంలో మూడు వేలకు పైగా పిం ఛన్లు అందిస్తున్నామన్నారు. అర్హులకు త్వరలోనే సొంతింటినిర్మాణానికి రూ.3 లక్షలిస్తామని తెలిపారు. దళితబంధు పథకం త్వరలో లబ్ధిదారులకు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, కౌన్సిలర్లు రాజన్న, సురేశ్, సుధాకర్, కో ఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, ప్రవీణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గడ్డం వికాస్, నాయకులు జగన్మోహన్ రెడ్డి, మెట్టు రాజు, గరిసే రవీందర్, దొంత నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది పాదం ప్రమోద్, శంకర్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.