ఆదిలాబాద్ రూరల్/ఉట్నూర్, జూన్ 12: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33 సెంటర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ -1 పరీక్షకు 7732 మంది అభ్యర్థులకు గాను 7566మంది హాజరయ్యారు. పేపర్-2 పరీక్షకు 3166మంది అభ్యర్థులకు గాను 3060మంది హాజరైనట్లు డీఈవో టామ్నె ప్రణీత తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో మహిళా అభ్యర్థులు పరీక్ష రాయడానికి వెళ్లగా, కొన్ని సెంటర్లలో చిన్నపిల్లలను తండ్రులు, వారి బంధువులు ఆడిస్తూ కనిపించారు.
నిర్మల్ అర్బన్/నిర్మల్ టౌన్/భైంసా/ఖానాపూర్ టౌన్/ జూన్ 12 : ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసేందుకు నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పేపర్-1 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 7734 మందికి గాను 7400 మంది హాజరయ్యారు. పేపర్-1కు మొత్తం 95.68 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 4829 మంది అభ్యర్థులకు గాను 4580 మంది హాజరయ్యారు. మొత్తం హాజరుశాతం 94.84 నమోదైంది.
పకడ్బందీగా ఏర్పాట్లు
టెట్ నిర్వహణకు నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో మొత్తం 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి మొత్తం 240 మంది అభ్యర్థులను కేటాయించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపడంతో అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారు. తల్లులు పరీక్ష రాయగా…చంటి పిల్లలను కుటుంబ సభ్యులు ఆడించారు.