కాగజ్‌నగర్‌టౌన్, జూన్ 12 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుశ్నపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఆరుగురు మావోయిస్టు సానుభూతి పరులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సురేశ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు కుశ్నపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద కౌటాల సీఐ స్వామి, బెజ్జూర్ ఎస్ఐ వెంకటేశ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో రెండు మోటర్ సైకిళ్లపై ఆరుగురు(మడె హన్మంతు, మడె నారాయణ, ఆలం భగవాన్, జాడే ఎక్నాథ్, నాగపురి చక్రపాణి, జాడె శాతారాం) బెజ్జూర్ నుంచి గూడెం వైపు వెళ్తున్నారు. అనుమానం వచ్చి వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా 53 డిటోనేటర్స్, 27 జిలెటిన్ స్టిక్స్ లభించాయి.
వారిని విచారించగా మురళీగూడ గ్రామానికి చెందిన మడె హన్మంతు వద్దకు నక్సలైట్లు వచ్చి పోయే వారని, వారి సిద్ధాంతాలు, పాటలకు ఆకర్శితుడై 1987 నుంచి మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని వారికి సహకరిస్తున్నాడని తెలిసింది. 1989లో బెజ్జూర్ పోలీస్‌స్టేషన్‌లో అతడిపై కేసు కూడా నమోదైనట్లు గుర్తించారు. జనవరి, 2022లో సంక్రాంతికి ముందు ఓ రాత్రి హన్మంతు ఇంటికి మావోయిస్టులు రాము, మరికొంత మంది వచ్చారు. అతడి ఫోన్ నంబర్ తీసుకొని వెళ్లారు. తర్వాత ఓ రోజు మావోయిస్టులు అతడిని పిలువగా ప్రాణహిత దాటి మహారాష్ట్రలోని సంద్ర అటవీ ప్రాంతానికి వెళ్లి సీపీఐ మావోయిస్టు పార్టీ ఆదిలాబాద్ జిల్లా డీసీఎస్ భాస్కర్ (మైలారపు ఆడెల్లు), మంగీదళ కమాండర్ వర్గీస్‌ను కలిశాడు.
పల్లెల్లో ఎవరైనా సమస్యలున్న వారిని గుర్తించి పార్టీలో చేర్పించేందుకు ప్రోత్సహించాలని వారు సూచించారు. మావోయిస్టు పార్టీలో చేర్పించాలంటూ వారితో సంబంధం ఉన్న హన్మంతుతో పాటు ఏటిగూడకు చెందిన మడె నారాయణ వద్దకు.. జనగాంకు చెందిన ఆలం భగవాన్ (సోదరుడు) గుండాయిపేట్కి చెందిన జాడె ఏక్నాథ్, నాగపురి చక్రపాణి, జాడె శాంతారాంను తీసుకెళ్లాడు. ఇదే విషయాన్ని వర్గీస్‌కు హన్మంతు తెలియజేశాడు. దీంతో ఛత్తీస్‌గడ్‌లోని బోర్గుడాకు తీసుకొని రమ్మని వర్గీస్ చెప్పగా 10 రోజుల క్రితం వారిని వెంట బెట్టుకొని వెళ్లాడు. కానీ దళం వారు కలవలేదు. మళ్లీ ఆదివారం హన్మంతు, చక్రపాణి, జాడే శాంతరాం, జాడే ఏక్నాథ్, భగవాన్, నారాయణ కలిసి గతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన పేలుడు పదార్థాలను తీసుకొని మావోయిస్టులను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టు సానుభూతి పరులను పట్టుకున్న కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దె స్వామి, ఎస్ఐ, పోలీసు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్‌హెచ్‌వో రవీందర్, రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐలు ప్రవీణ్‌కుమార్, సనత్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.