నార్నూర్, జూన్ 12 : రైతులకు చేరువలో ఉంటూ పూర్తిస్థాయిలో వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం రైతు వేదికలను నిర్మిచింది. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని తొమ్మిది క్లస్టర్లలో పూర్తయిన రైతువేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లను నియమించింది. ప్రతి క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాలు సాగు అవుతుందని, రైతులు దాదాపు 2వేలకు పైగా ఉండేలా రైతు వేదికలు ఏర్పాటు చేశారు. ఇందులో పంట వివరాలు, సమావేశాలు, కొత్త పంటలు, రాయితీ యంత్రాలు, విత్తనాలు, సాగు చేసిన పంటలను ఆన్లైన్లో నమోదు చేసే విషయాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఏఈవో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.
నార్నూర్, గాదిగూడ మండలాల్లో….
గాదిగూడలో-4, నార్నూర్-5 క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రెండు మండలాల్లోని తాడిహత్నూర్, నార్నూర్, షేకుగూడ, బాబేఝరి, ఉమ్రి, లోకారి(కే), దాబా(బీ), ఖండో, గాదిగూడలోని రైతువేదిక భవనాలు ప్రారంభమయ్యాయి. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించుకుంటూ సలహాలు, సూచనలు పొందుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. క్లస్టర్లో భూసార పరీక్షలు, ఆన్లైన్ సేవలు, ఏ సమయంలో ఏ పంటలు సాగు చేయాలో రైతు వేదికల్లో ఉండే అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు అందించే సలహాలు, సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులు, రాయితీలు, పంటల తెగుళ్లు, ఉధృతిని క్షేత్రస్థాయిలో ఏఈవోలు పరిశీలిస్తూ ఏ మందును పిచికారీ చేయాలో రైతులకు వివరిస్తున్నారు. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు సమావేశంలో పాల్గొంటూ రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. స్థానికంగా రైతు వేదికలు ఏర్పాటు చేయడంతో రైతులకు దూరభారం తగ్గింది. అధికారులు కూడా అందుబాటులో ఉంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి రైతువేదికలు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమని రైతులు పేర్కొంటున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతు వేదికల్లో ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటున్నాం. రైతులు సమస్యలు వివరించడానికి రైతు వేదికలకు వస్తున్నారు. వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నాం. అవసరమైతే క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నివారణ చర్యలు తెలియజేస్తున్నాం. సేవలను సద్వినియోగం చేసుకోవాలి. –నిఖిల్ (వ్యవసాయ విస్తరణ అధికారి,ఉమ్రి క్లస్టర్)