నిర్మల్ అర్బన్, జూన్ 12 :మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోడీ దిగజారుస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పర్యటించారు. శ్రీనగర్ కాలనీలో ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి గతంలో రూ. 16 లక్ష లు, ప్రస్తుతం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంటే, బీజేపీ మతానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు.
దేశ ప్రతిష్టను మోడీ దిగజారుస్తున్నారని విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని దెబ్బతీసినట్లయితే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ పగటి కలలు కంటున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను 13 భాషల్లో ఇతర రాష్ర్టాల ప్రజలకు అర్థమయ్యేలా సీఎం కేసీఆర్ వివరించారని చెప్పారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతితో కాలనీలు అభివృద్ధి చెందాయన్నారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిర్మల్‌కు రూ.23 కోట్లు రానున్నాయని, ఇప్పటికే రూ.4 కోట్లతో వైకుంఠధామం పనులు చేపట్టినట్లు తెలిపారు.
రూ.42 కోట్లతో పట్టణ ప్రజలకు తాగు నీటిని అందిస్తున్నామని చెప్పారు. రూ.3 కోట్లతో కంచరోని చెరువులో వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. దసరా నాటికి కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో కొనసాగుతున్న ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు తులసీ నర్సాగౌడ్, సంపంగి రవి, శ్రీనగర్ కాలనీ అధ్యక్షుడు ఉమాపతి గౌడ్, కార్యదర్శి ప్రవీణ్, జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షుడు తిరుపతి, గౌరవాధ్యక్షుడు నాలం మదన్మోహన్, కాలనీ వాసులు ఉన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు
సారంగాపూర్, జూన్ 12: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మల్లక్చించోలిలో భీమన్న ఆలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లలో అనేక దేవాలయాలకు నిధులు వెచ్చించి పూర్వవైభవాన్ని తీసుకువచ్చామని చెప్పారు. నిర్మల్‌లో రూ. 42 కోట్లతో 280 బెడ్లతో దవాఖాన, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు మంజూరైనట్లు చెప్పా రు. జవళా నుంచి మల్లక్ చించోలి రాజరాజేశ్వర్ ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు, రూ.25లక్షలు పంచాయతీ భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 27వ ప్యాకే జీ కింద మంజూరైన హైలెవల్ కెనాల్ సొరంగం పనులు పూర్తయితే స్వర్ణ, ధోనిగాం ప్రాజెక్టులకు నీరు పుష్కలంగా ఉంటుందన్నారు. బోరిగాం, వెంగ్వాపేట్, జాప్రాలపూర్ గ్రామాలకు చెక్‌డ్యామ్‌లు మంజూరైతే నీటికి ఢోకా ఉందన్నారు.
యాదాద్రి ఆలయానికి దాతల సహకారం
యాదాద్రి దేవాలయానికి జామ్ గ్రామపంచాయతీ కో-ఆప్షన్ సభ్యుడు ముద్రం దినేశ్ రూ. 10,116, మల్లక్చించోలి సర్పంచ్ దశరథ భోజరాజ్ రూ. 11వేలు విరాళం ప్రకటించారు. ఈమేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి చెక్కులు అందించారు. కార్యక్రమంలో మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లయ్య, ఎంపీటీసీ సరిత, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో సరోజ, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో లక్ష్మారెడ్డి, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, ఇస్మాయిల్, సాగర్‌రెడ్డి, దేవిశంకర్, కండెల భోజన్న, ఎకిలేరి భోజన్న, సూర్యం పాల్గొన్నారు.
పరామర్శ
లక్ష్మణచాంద, జూన్12 : మండలంలోని పీచర మాజీ సర్పంచ్ దాబ రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, రాంకిషన్ రెడ్డి, మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రమేశ్, మేకల రాజేందర్ యాదవ్, భూమేశ్,భూమన్న, గ్రామస్తులు ఉన్నారు.