దండేపల్లి, జూన్ 9 :కోయ పోషగూడ గిరిజనుల పోడు భూమి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, అర్హులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో అంకిత్ భరో సానిచ్చారు. దండేపల్లి మండలంలోని మాకులపేట జీపీ పరిధిలోని కోయపోషగూడ గిరిజన గ్రామాన్ని ఐటీడీఏ పీవో, జిల్లా అటవీశాఖాధికారి శివానీ డోంగ్రే, ఎఫ్డీవో మాధవరావు, తహసీల్దార్ హన్మంతరావు, సీఐ కరీముల్లాఖాన్, ఎస్ఐ సాంబమూర్తి, ఎఫ్ఆర్వో రత్నాకర్రావుతో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులకు అటవీ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.
గిరిజనుల భూసమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ప్రతి ఒక్కరూ సంయమ నం పాటించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడి, ప్రతి కుటుంబానికీ మూడు ఎకరాల భూమి ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిరిజనులు ఆక్రమించుకున్న స్థలాన్ని అధికారులు పరిశీలించారు. గిరిజనులు అటవీ భూములను వదిలి ఇంటికి వెళ్లాలని, ఇక్కడే ఉంటే అటవీ జంతువులతో ప్రమాదమని సూచించారు. మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మూడు ఎకరాల భూమిని కేటాయించాలని గిరిజనులు అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేనా జిల్లా అధ్యక్షుడు కొట్నాక తిరుపతి, ప్రధాన్ సంఘం నాయకులు అడాయి కాంతారావు, షాదం బాపు, గిరిజనులు ఉన్నారు.
పోడు భూముల పేరిట అడవులు నరకడం నేరం : డీఎఫ్వో
పోడు భూముల పేరిట అడవులను నరకడం చట్టరీత్యా నేరమని జిల్లా అటవీశాఖాధికారి శివానిడోంగ్రే అన్నారు. దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ కార్యాలయ ఆవరణలో గురువారం ఐటీడీఏ పీవో అంకిత్, ఎఫ్డీవో మాధవరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2005 కంటే ముందు పోడు భూముల్లో సాగు చేసినట్లు ఆధారాలు ఉన్నవారికే భూమి హక్కు పత్రాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఇప్పుడు కొత్తగా అడవులు నరికి పోడు సాగుకు ప్రయత్నిస్తే గిరిజనులకు కేసులు తప్ప భూములు దక్కవని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సార్లు కోయపోషగూడెం గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అయినా మార్పు రాకపోవడంతో కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసి జైలుకు పంపే క్రమంలో మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని అనడం అవాస్తవమన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ గిరిజనులకు ప్రభుత్వ పరంగా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ట్రైకార్ పథకంతో నిరుద్యోగ యువతి, యువకులను ఆదుకుంటామని తెలిపారు.