భీంపూర్, జూన్ 9 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండంలోని అంతర్గాంకు చెందిన బైరెడ్డి సంతోష్-అర్చన దంపతులకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఎన్నో నోములు, పూజలు చేసిన తర్వాత 16 ఏండ్లకు నైతిక్(2) జన్మించాడు. ఇక వారి ఆనందానికి అవధుల్లేవు. బాబును అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉదయం పాము కనిపించింది. స్థానికులు దాని ని పట్టుకొని కర్రలతో కొట్టారు.
చనిపోయిందనుకున్నారు. దానిని కర్రతో బయట విసిరేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నానమ్మ దగ్గ్గర కూర్చున్న నైతిక్పై పాము పడింది. ఒక్కసారిగా కోపంతో బాబును కాటేసింది. పాము పడగ విప్పడంతో కుటుంబీకులతో సహా అక్కడున్న వారంతా పరుగులు తీశారు. బాబును హుటాహుటీన రిమ్స్‌లో చేర్పించారు. వైద్యులు ఉదయం నుంచి రాత్రి వరకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి బాబు మృతి చెందాడు. కాగా.. సంతోష్-అర్చనకు వివాహమైన 16 ఏండ్లకు ఈ బాబు పుట్టగా.. ఇప్పు డు ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడం వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. వారు రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.