తెలంగాణ సర్కారు వానకాలం పంటలపై కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా రైతన్నలకు ఈనెల 15వ తేదీ నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నది. సాగు విధానం, లాభసాటి పంటలు, తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యం ఉన్న పంటలు వేసేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గతంలో వేసిన పంటలు కాకుండా విభిన్న పంటలు వేసే విధంగా ప్రోత్సహించనున్నారు. ఈసారి పత్తి సాగులో కొత్త విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వినూత్న రీతిలో సాగు చేయడం, అధిక సాంద్రత, ఎరువుల వినియోగం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు.
వానకాలం సీజన్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి రైతు వేదికలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించనున్నది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్లో ఏఈఓలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అవగాహన కల్పించనున్నది.
– నిర్మల్, జూన్ 8 (నమస్తే తెలంగాణ)
ప్రతి ఏఈవో 150 మంది రైతులను ఎంపిక చేసుకొని, కనీసం 400 ఎకరాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. యాజమాన్య పద్ధతుల్లో భాగంగా ముందుగా సబ్సిడీపై అందజేసే పచ్చిరొట్ట సాగు చేయించి, భూసారం పెరిగేలా చూస్తారు. అందుకోసం ఒక్కో ఏఈవో తమ క్లస్టర్ పరిధిలోని 30 మంది రైతులను ఎంపిక చేసుకొని 150 ఎకరాల్లో సాగు చేయించాల్సి ఉంటుంది. అలాగే వరి అయితే వెదజల్లే పద్ధతిలో 25 మంది రైతులను ఎంపిక చేసి 50 ఎకరాల్లో సాగు చేయించాల్సిన బాధ్యత ఏఈవోలపై ఉంటుంది. వీటితోపాటు పత్తిని వినూత్న రీతిలో సాగు చేయడం ఎలా.., అధిక సాంద్రత పత్తి సాగు, ఎరువుల వినియోగం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.
లాభసాటి పంటలపైనే దృష్టి..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యం ఉన్న పంటలు పండించేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. వరి సాగు చేస్తే ఎకరాకు 30 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ధాన్యం క్వింటాలుకు రెండువేల చొప్పున విక్రయించినా రూ.60 వేలు మాత్రమే వస్తాయి. ఇందులో ఖర్చులు పోనూ రూ.20 వేలు కూడా రావడం లేదు. ఇలా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతులు నష్టపోతున్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభం వస్తుందనే విషయాన్ని అధికారులు రైతులకు వివరిస్తారు. కాగా, పత్తి ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, రూ.లక్ష వరకు చేతికి అందుతుంది. ఖర్చులు పోను రూ.50వేల వరకు మిగిలే అవకాశం ఉన్నది. అలాగే పత్తితో పాటు కంది, పెసర, మినుము, ఇతర ఉధ్యాన పంటల ద్వారా వచ్చే లాభాలపై సదస్సుల్లో రైతులకు వివరించనున్నారు.
ఇతర పంటల సాగు పెంచడమే లక్ష్యం..
గత వానకాలం సీజన్లో సాగు వివరాలు తీసుకొని, ఈసారి 10 శాతం నుంచి 20 శాతం ఇతర పంటల సాగు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో గత సీజన్లో పత్తి 80 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి లక్ష ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సోయా గతేడాది 75 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈ సారి 90 వేల నుంచి లక్షా 10వేల ఎకరాలు.., కంది 30 వేల ఎకరాల్లో సాగు చేయించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాగా, ఎక్కువ మంది రైతులను ఉధ్యాన పంటల సాగుకు మళ్లించేలా ఆ శాఖ చర్యలు చేపట్టనున్నది. ఇందులో భాగంగా ఆయిల్ పాంతో అధిక లాభాలు రావడం.., దానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ అందిస్తుండడంతో ఈ పంటల సాగు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం సారంగాపూర్ మండలం బీరవెల్లి వద్ద ఆయిల్‌పాం నర్సరీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు 8 వేల ఎకరాల్లో సాగుకు జిల్లా రైతులు ముందుకు వచ్చారు. మార్కెటింగ్ సైతం కంపెనీలే చేస్తున్న తరుణంలో రైతులను ఆ దిశగా మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు.
పత్తిలో కొత్త రకం విత్తనాలు..
పత్తి ఏరేందుకు కూలీల కొరత కారణంగా చాలా మంది రైతులు వరిసాగు వైపు మళ్లారు. సాధారణంగా ఈ పంట దసరా సీజన్లో చేతికి వస్తుంది. ఆ సమయంలో తుఫాన్లు వచ్చే అవకాశం ఉండగా, పత్తి తడిస్తే చేతికి రావడం కష్టం. పైగా మూడుసార్లు ఏరేందుకు కూలీలు దొరక్కపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో ఈసారి ప్రభుత్వం కొన్ని కంపెనీలతో ప్రయోగాలు చేయించి, పంట మొత్తం ఒకేసారి చేతికందేలా కొత్త రకాలను అందుబాటులోకి తెచ్చింది. గతంలో మూడుసార్లు ఏరితే ఎంత దిగుబడి వచ్చేదో ఈ రకం విత్తనం వల్ల ఒకేసారి ఏరినా అంతే దిగుబడి వస్తుంది. అలాగే కూలీలతో సంబంధం లేకుండా సదరు కంపెనీలే మిషన్ల ద్వారా పత్తి ఏరేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఈ రకం పత్తి సాగు చేయించేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతున్నది. ఎకరాకు ఐదు ప్యాకెట్లు అవసరమవుతుండగా, మూడు ప్యాకెట్ల డబ్బులను ప్రభుత్వమే అందించనున్నది.
ప్రతి క్లస్టర్లో నిర్వహిస్తాం..
వానకాలం సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించడం, లాభాసాటి పంటలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా చూడడమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్లస్టర్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత సీజన్లో వేసిన ఇతర పంటల శాతం పెంచేలా చర్యలు చేపడుతున్నాం. ఈసారి పత్తి పంటలో కొత్త వెరైటీ విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చాం. జిల్లా వ్యాప్తంగా 10వేల ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేయించడంతో పాటు రైతులకు మూడు ప్యాకెట్లు ఉచితంగా ఇస్తాం. కంపెనీల సహకారంతో ఒకేసారి మిషన్ ద్వారా పత్తి ఏరేలా చర్యలు చపడతాం. – అంజీప్రసాద్, వ్యవసాయ అధికారి, నిర్మల్ జిల్లా