ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆరో రోజైన బుధవారం జోరుగా కొనసాగాయి. ఆయా చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తూ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ పనులు చేపట్టారు. ప్రజలు కూడా ఉత్సాహంగా, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాముల వగా, యంత్రాంగం వారికి అవగాహన కల్పించారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందికి పలు సలహాలు అందిస్తూ ప్రగతి పనుల విజయవంతానికి కృషి చేశారు. నిర్మల్‌జిల్లా సారంగాపూర్ మండలంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్, ఆసిఫాబాద్ మండలంలో ఎమ్మెల్యే సక్కు, జైనూర్ మండలంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పాల్గొన్నారు.
– నిర్మల్, జూన్ 8 (నమస్తే తెలంగాణ)
నిర్మల్, జూన్ 8(నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హుషారుగా పాల్గొంటున్నారు. ఆరో రోజు బుధవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కాలనీలు, గ్రామాల్లోని పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చి వేయడం, పాడుబడ్డ, బోరు బావులను పూడ్చి వేసి పరిసరాలను శుభ్రంగా మార్చారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని హనుమాన్ తండాలో నిర్వహించిన పల్లె ప్రగతిలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. తండాలోని వీధుల్లో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటింటికీ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఖానాపూర్ మండలంలోని రాజూర, బావాపూర్ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు.
అలాగే ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే పెంబి మండలంలోని మందపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్లు ప్రారంభించారు. కాగా నిర్మల్ పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగ తి పనులను అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్లు పరిశీలించారు. మంజులాపూర్ ఎస్సీ కాలనీ, జోహ్రనగర్ కాలనీ, గొల్లపేట్, ఎఎన్ రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడంతోపాటు, ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఇంద్రవెల్లి మండలంలోని అంజీ, వడ్గాం గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని జరుగుతున్న పనులను పరిశీలించారు.