మృగశిర(మిరుగు) కార్తె, చేపల కూరకు విడదీయలేని అనుబంధం ఉంది. కార్తె ప్రవేశించే రోజు చేపల కూర తింటే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని వైద్యశాస్త్రం తెలుపుతున్నది. బుధవారం మృగశిర కార్తె ప్రవేశించడంతో చేపల మార్కెట్లు కళకళలాడాయి. జిమ్మల కోసం జనం ఎగబడ్డారు. మిషన్ కాకతీయ ఫలితంగా చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంది. సర్కారు కూడా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో తక్కువ ధరతోపాటు తాజా చేపలు లభించాయి.
నిర్మల్ అర్బన్/ నిర్మల్ టౌన్/ మామడ/దస్తురాబాద్/ ఉట్నూర్ రూరల్, జూన్ 8 : మృగశిర కార్తె (మిరుగు)ను బుధవారం జిల్లావాసులు ఘనంగా జరుపుకున్నారు. చేపలకు భలే డిమాండ్ ఏర్పడింది. మిరుగు రోజున చేపలు తినాలనేది ఆనవాయితీ. దీంతో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్కు పరుగులు తీశారు. వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. ఒక్కో రకం చేప కిలోకు రూ.150- 200 వరకు విక్రయించారు. సాధారణ రోజుల్లో కంటే ఇది కిలోకు రూ.50 వరకు అదనం. అయినా వినియోగదారులు ఎగబడి కొన్నారు. రైతులు ఈ కార్తెలో విత్తనాలు వేసుకుంటారు. కాగా.. జిల్లాలోని చెరువులు, గోదావరి పరీవాహక ప్రాంతాలు మత్స్యకారులు, కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి.