ఎదులాపురం, జూన్ 8 : ఆదిలాబాద్ పట్టణం సహా పరిసరాల్లో ఇటీవల చిత్రమైన మోసాలు వెలుగు చూస్తున్నాయి. అమాయకులే లక్ష్యంగా నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ నెల 5న బాధితు లు డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఓ వాడలో ఇద్దరు బాబా వేషధారణలో ఇండ్లల్లో జ్యోతిష్యం చెబుతామంటూ కారులో తిరుగుతున్నారు. గ్రహ దోష నివారణ చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రాం నగర్లో నివాసముండే వేణు-హరిత దంపతుల ఇంటికొచ్చారు. ప్రైవేట్ ఉద్యోగైన వేణు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. ఈ బాబాలు బయ ట తిరుగుతుండగా.. బయట ఉన్న వేణు అత్తమ్మ వీరిని ఇంట్లోకి పిలిచింది.
ఇంట్లో గ్రహదోషాలు ఉన్నాయని, పూజలు చేస్తే అంతా బాగా జరుగుతుందని నమ్మించారు. పూజ సమయంలో వేణు ఒక్కడే ఇక్కడ ఉండాలని, ఇతరులు వేరే గదిలో ఉండాలని సూచించారు. దీంతో ఆ కుటుంబ స భ్యులు వేణును ఒక్కడినే ఉంచి పక్క గదిలోకి వె ళ్లారు. పూజ సామగ్రిని హరితతో తెప్పించారు. ఈ బాబాలు పూజను మొదలు చేసేముందు వేణుకు ఒక తినుబండారం ఇచ్చారు. అది తిన్న అతను క్రమంగా స్పృహ కోల్పోయాడు. ఇదే అదనుగా కప్‌బోర్డులో ఉన్న రూ.13 వేలు అపహరించారు. తర్వాత బయటికి వచ్చి.. వేణు కొద్దిసేపు నిద్రమత్తులో ఉంటాడని, అనంతరంమామూలుగా అవుతాడని చెప్పి దక్షిణ తీసుకొని కారెక్కి వెళ్లిపోయా రు. స్పృహ నుంచి కోలుకున్న తర్వాత కబోర్డులో ఉన్న డబ్బులు దొంగిలించబడ్డాడని వేణు తెలుసుకున్నాడు. తాము మోసపోయామని గ్రహించి డ యల్ 100కు ఫోన్ చేశాడు. పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. దొంగబాబాలను పట్టుకునేందుకు గస్తీ ముమ్మరం చేశారు.
మరో రెండిళ్లలో రూ.4 వేలు..
ఈ బాబాలు రాంనగర్లో మరో ఇంట్లో, దు బ్బగూడలో ఒక ఇంట్లో నమ్మించి మొత్తంగా రూ.4 వేలు అపహరించారు. ఈ బాబాలు మరో కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లను, ఒక సోదరుడిని మోసగించే ప్రయత్నం చేసినా వారు నమ్మలేదు. ఈ ముఠా ముందుగా మాసిన బట్టలతో రెక్కీ చేస్తారని, తర్వాత పలువు రి అవసరాలను ఆసరాగా చేసుకొని వారి ఇండ్లలో తిష్ట వేసి పని కానిస్తారని పలువురు పేర్కొంటున్నారు.