ఎదులాపురం, జూన్ 8 : ఒక విదేశీ ముఠా డ్రైఫ్రూట్స్ దుకాణంలో కరెన్సీ గురించి అడిగి వారి కళ్లుగప్పి నగదు అపహరించింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ పరిధిలో పాత జాతీయ రహదారికి ఆనుకొని నేచురల్ డ్రైఫ్రూట్స్ దుకాణం ఉంది. ఈ నెల 7న సాయంత్రం కారులో ఐదుగురు విదేశీయు లు వచ్చారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మేనేజర్ శ్రీకర్‌తో మాట్లాడారు. డ్రైఫ్రూట్స్‌ను పరిశీలించారు. విదేశీయుల వద్ద అప్పుడు రూ.100 ఇండియన్ కరెన్సీ మాత్రమే ఉంది. దీంతో వారు మేనేజర్ శ్రీకర్‌ను ఇంత కన్నా పెద్ద నోట్లు ఉన్నాయా? అని అడిగారు. అతను రూ.200 చూయించాడు. ఇంకా పెద్ద నోటు రూ.2 వేలది ఉంటుందని, అది తనవద్ద లేదని సమాధానమిచ్చాడు.
ఆ సమయం కంటే ముందు ఒక మిత్రుడు రూ.50 వేల బండిల్ మేనేజర్‌కు ఇచ్చి వెళ్లాడు. అవి కౌంటర్లో వేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.500 నోటు ఇలా ఉంటుందని మేనేజర్ ఆ బండిల్ నుంచి తీసి విదేశీయుడికి చూపాడు. అప్పుడు ఒక విదేశీయుడు మేనేజర్ దగ్గర ఉండగా.. ఆ సమయంలోనే ఈ ముఠాలోని మహిళ తను డ్రైఫ్రూట్స్ చూస్తూ మేనేజర్‌ను పిలిచింది. ఈ వ్యవధిలోనే ఇక్కడ ఉన్న మరో విదేశీయుడు రూ.50 వేల బండిల్ నుంచి అందినంత తీసుకొని జేబులో వేసుకున్నాడు. ఆ తరువాత ఏమీ కొనకుండానే హడావిడిగా వెళ్లి కారెక్కి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మేనేజర్‌కు అనుమానం వచ్చి కౌంటర్ తెరిచి చూసి డబ్బు లెక్కబెట్టాడు. అందులోంచి రూ.22 వేలు అపహరించినట్లు తెలుసుకున్నాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. వారు క్షణాల్లోనే అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజీలు చూశారు. ఈ పుటేజీల్లో వీడియో రికార్డు కాలేదు. ఈ ముఠా దుకాణం పైఅంతస్తులో ఉన్న మాంస్ కిచెన్‌లో ( బిర్యాణి హౌస్)లో సోమవారం రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కలిసి భోంచేశారు. ఇక్కడ దుకాణంలో అన్ని సీసీ కెమెరాలను ఈ ముఠా హ్యాక్ చేసినట్లు తెలుసుకున్నారు. ఈ దు కాణం బయటి సీసీ కెమెరాల్లో ఇక్కడి నుంచి ఒక లగ్జరీ కారు వెళ్లిన దృశ్యాలు మాత్రమే రికార్డయ్యాయి. ఈ విషయమై డీఎస్పీ ఉమేందర్‌ను అడుగగా.. తమకు ఫిర్యాదు రాలేదని, వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.