మంచిర్యాల, జూన్ 5, నమస్తే తెలంగాణ :మంచిర్యాల జిల్లాలోని పలు సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్యతో కలిసి సమావేశమయ్యారు. సింగరేణి ఇండ్ల పట్టాలకు సంబంధించిన జీవో 76 కాల పరిమితిని మరో రెండు నెలలు పొడిగించాలని, చెన్నూర్ ఎత్తిపోతల పథకం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల, బెల్లంపల్లి శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పలువురు అధికారులతో సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. జిల్లాలోని సమస్యలపై విన్నవించి, పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య సోమవారం సమావేశమయ్యారు. సింగరేణి ఇండ్ల పట్టాలకు సంబంధించి విడుదల చేసిన జీవో 76 కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
చెన్నూర్ పట్టణంలోని ఆబాది భూముల సమస్యలను పరిష్కరించాలని, చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఆర్టీ క్వార్టర్స్ సమస్యను త్వరగా పరిష్కరించాలని, జిల్లాలోని రెవెన్యూ-ఫారెస్ట్ మధ్య నెలకొన్న భూ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల సమస్యలపై సీడీఎంఏ సత్యనారాయణను కలిసి విన్నవించారు. తర్వాత వారు ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డితో సమావేశమయ్యారు. చెన్నూర్ నియోజకవర్గంలోని ఎన్‌హెచ్ 63 పరిధిలో గల జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు.