బాసర, జూన్ 6 : గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం బాసరను సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా రోడ్డుపక్కన నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఆలయానికి వెళ్లే రోడ్డుతో పాటు గోదావరి, రైల్వేష్టేషన్ మార్గాల్లో మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం కిర్గుల్(కే)లోని పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నదన్నారు.
ఈ విద్యాసంవ్సతరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. అనంతరం గోదావరిని సందర్శించారు. గోదావరిలో ఆత్మహత్యలు, ప్రమాద ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో స్నాన ఘాట్ వద్ద జాలీలు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్నాన ఘాట్, బ్రిడ్డి వద్ద నిఘా ఉంచాలని, మైక్ ద్వారా అనౌన్స్ మెంట్ చేస్తూ భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్ హెమంత్ బోర్కడే, బాసర సర్పంచ్ లక్ష్మణ్‌రావు, ఎంపీడీవో నాగనాథ్, ఎస్ఐ మహేశ్, అధికారులు ఉన్నారు.