ఆదిలాబాద్, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల రవాణా కోసం బస్సులు వినియోగిస్తారు. పట్టణాలు, గ్రామాల్లోకి బస్సులు పంపి విద్యార్థులను తరలిస్తారు. ఇందుకోసం యాజమాన్యాలు స్వయంగా వాహనాలను సమకూర్చుకుంటాయి. విద్యార్థుల నుంచి రవాణా చార్జీలను వసూలు చేస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్కూల్, కాలేజీల యాజమాన్యాలు 1,009 బస్సులను విద్యార్థుల రవాణాకు వాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 192 బస్సులు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 102, మంచిర్యాలలో 436, నిర్మల్లో 279 బస్సులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యాసంస్థలు సరిగా నడువలేదు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ యేడాది విద్యాసంవత్సరం సరైన సమయంలో ప్రారంభంకానుంది. ఈ నెల 14 నుంచి పాఠశాలలు తెరువనున్నారు.
ఫిట్నెస్ తప్పనిసరి
విద్యార్థుల రక్షణ చర్యల్లో భాగంగా స్కూల్, కళాశాలల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల కండిషన్, ఇతర నిబంధలను యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలి. బస్సు డ్రైవర్లు ఐదేండ్లు అనుభవం కలిగి ఉండి 60 ఏండ్లకు మించకుండా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి బస్సుకు అటెండర్ ఉండడంతోపాటు విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోపాటు పలు రక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా ప్రతి యేడు విద్యాసంవత్సరం ప్రారంభంలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ బస్సులను జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి ఫిట్నెస్ చేయించుకోవాలి. రవాణా శాఖ అధికారులు బస్సుల కండిషన్తోపాటు ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం అన్ని సరిగా ఉన్న బస్సులకు ఫిట్నెస్ చేస్తారు. నిబంధనలు పాటించని బస్సులకు అనుమతులు నిరాకరిస్తారు. అధికారులు అనుమతించిన బస్సులను మాత్రమే యాజమాన్యాలు విద్యార్థుల రవాణా సౌకర్యానికి వినియోగించాలి. మే 15 నుంచి బస్సుల ఫిట్నెస్ ప్రారంభం కాగా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల నుంచి సరిగా స్పందన లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,009 బస్సులు ఉండగా కేవలం 27 బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేయించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏ ఒక్క బస్సుకు ఫిట్నెస్ కాకపోగా ఆదిలాబాద్లో 2, మంచిర్యాలలో 4, నిర్మల్లో 21 బస్సులను యాజమాన్యాలు ఫిట్నెస్ చేయించాయి. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.
ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,009 స్కూల్, కళాశాలల బస్సులు ఉండగా.. కేవలం 27 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేయించుకున్నారు. స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం వినియోగించే బస్సుల్లో రక్షణ చర్యలు తప్పనిసరి పాటించాలి. విద్యాసంవత్సరం సరైన సమయంలో ప్రారంభంకానుండడంతో బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలి. స్కూళ్లు ప్రారంభమైన తర్వాత రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం.
– పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్, రవాణాశాఖ.