తాంసి, మే 31 : జిల్లాలోని రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ శాఖ ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో ఇతర జిల్లాలకు కేటాయించ వద్దని ఆదేశించారు. వానకాలం సీజన్‌కు సంబంధించి 24 రైల్వే వ్యాగన్ల ద్వారా 36,788 మెట్రిక్ టన్నుల యూరియా, 4467 మెట్రిక్ టన్నుల డీఏపీ, 15,741 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, మిగతా ఎరువులు కలిపి మొత్తం 57,907 మెట్రిక్ టన్నులు జిల్లాకు కేటాయించారని తెలిపారు. వ్యాపారులకు పంపిణీ చేసిన ఎరువుల వివరాలు ఎంఎఫ్‌ఎంఎస్ ఐడీతో సత్వరమే జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ఎరువుల అమ్మకాలను పీవోఎస్ మిషన్ల ద్వారా చేపట్టాలని, రైతుల ఆధార్‌కార్డు ద్వారా వాటిని అందజేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ టెక్నికల్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయాధికారి భగత్ రమేశ్ కుమార్, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.
అందుబాటులో సోయా విత్తనాలు
సోయా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని బోథ్ సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్ తెలిపారు. మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం సోయా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎస్- 335 రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నీరజ్ రకం రూ. 3,200, హీరామోతీ రకం రూ. 3,500, నేషనల్ సీడ్స్ రకం రూ. 3,700 ఉన్నట్లు పేర్కొన్నారు. కావాల్సిన రైతులు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్లు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, సీఈవో స్వామి, తదితరులు పాల్గొన్నారు.