బేల, మే 31: ఎందరో వీరనారుల్లో అహల్యాదేవి ఒకరని, ఆమె ధైర్యం స్త్రీ జాతికి ఆదర్శమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని సాంగిడి గ్రామం లో మంగళవారం గొల్ల, కురుమలు ఏర్పాటు చేసిన అహల్యాదేవి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మాన్ని కాపాడడమే కాకుండా దోపిడీ వ్యవస్థను బెదిరించిన వీరనారి అహల్యాదేవి నేటి సమాజానికి ఆదర్శ స్త్రీ మూర్తిగా నిలిచిందన్నారు. గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నదని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రైతాంగానికి ఎలాంటి సహకారం అందలేదన్నారు. సీఎం కేసీఆర్ చనాకా-కొరటా బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టి త్వరలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం గొల్ల, కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్యే రామన్నను పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్, నాయకులు గంభీర్ ఠాక్రె, ప్రమోద్‌రెడ్డి, సతీశ్ పవార్, జక్కుల మధుకర్, మెట్టు ప్రహ్లాద్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, మస్కేతేజ్రావు, రఘుకుల్‌రెడ్డి, కన్నల గంగన్న, రాకేశ్, బాల్‌చందర్, చంద్రాపూర్ జిల్లా గొల్ల, కురుమ సంఘం అధ్యక్షుడు కైలాస్ ఉరాడే తదితరులున్నారు.