తాంసి, మే 24 : వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అధిక దిగుబడులు వచ్చేలా చూడాలని, అందుకు కొత్త వంగడాలను సృష్టించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో మంగళవారం విత్తనమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాగుకోసం ఎంతగానో కృషిచేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అవసమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి, ఆర్థికంగా బలోపేతమవ్వాలని రైతులకు సూచించారు.
ముఖ్యంగా సాయిల్టెస్ట్ చేయించుకోవాలని, నేలలో లోపాలను సరిచేసుకుంటేనే అధిక దిగుబడులు సాధ్యమన్నారు. ఎరువులు అధికంగా వాడినా అనర్థం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, నేల సత్తువ కోల్పోతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అధికారులు మొక్కలు అందజేసి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టాండింగ్ కమిటీ మెంబర్ బక్కి గోవర్ధన్ యాదవ్, ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్‌చౌహాన్, కేవీకే ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్‌కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ తిరుమల్‌రావు, డాక్టర్ డీ మోహాన్దాస్, వ్యవసాయశాఖ ఏడీఏ రమేశ్, రైతుసంఘం నేతలు దారట్లకిష్టు, నరేశ్‌జాదవ్, కేమ లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.
విత్తన ఎంపిక చాలా ముఖ్యం…
యేటా వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తనమేళా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని రైతులను ఒక వేదికపైకి తెచ్చి, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలను రైతులకు పరిచయం చేసి అవగాహన కల్పిస్తున్నాం. రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయం రిసెర్చ్ చేసిన కంది, సోయా, వరి, జొన్న, మక్క తదితర విత్తనాల గురించి రైతులకు వివరించాం.
– డా.శ్రీధర్ చౌహాన్, ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఆదిలాబాద్
అధిక సాంద్రత పద్ధతితో దిగుబడి..
జిల్లాలోని మెజార్టీ రైతులు పత్తి సాగు చేస్తారు. నూతనంగా తీసుకువచ్చిన అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయాలి. ఎకరాకు 25 వేల మొక్కలు వచ్చేలా చూసుకోవాలి. మొక్కకు 10-15 కాయలు వచ్చినా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మొక్కలు ఏపుగా పెరగకుండా మార్కెట్లో లభించే పిచికారీ మందును 45 రోజుల దశలో 65-70 రోజుల దశలో వాడాలి. కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఏర్పడుతుంది.
-డా.తిరుమల్‌రావు, సైంటిస్ట్, ఏఆర్ఎస్, ఆదిలాబాద్
ఉద్యాన పంటలు వేయాలి..
జిల్లాలోని నేలలు ఉధ్యాన పంటలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. జిల్లా రైతులు వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలు వేసుకుంటే అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తున్నది. మామిడి, సీతాఫలం, అల్లనేరేడు తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలంటే సంబంధిత ఉధ్యానశాఖ అధికారులను సంప్రదించాలి. ఈ పంటలు వేసి రైతన్నలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి.
-డా.సుచిత్ర, సీనియర్ సైంటిస్ట్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, ఆదిలాబాద్