బేల, మే 24 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. బేల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనిత ఠాక్రే అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. వ్యవసాయ అధికారి విశ్వామిత్ర తమ నివేదికను చదివి వినిపించారు. వానకాలం సీజన్లో రైతులు నాణ్యమైన విత్తనాలు నాటేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యల గురించి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మణియర్పూర్, పాఠన్, చాంద్పల్లి సర్పంచ్లు తేజ్రావ్, ఫైజూల్లాఖాన్, జంగ్శౌవ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. యువకుల కోసం ప్రతి గ్రామంలో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని చప్రాల , సాంగిడి గ్రామాల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఇంద్రశేఖర్, ఎంపీడీవో భగత్ రవీందర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎస్ఐ కృష్ణకుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.