ఆదిలాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);“నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి వెనుకాడం. ఇప్పటికే నాసిరకాన్ని నిరోధించడానికి వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను నియమించాం. ఎవరైనా అమ్మితే సాధారణ ప్రజలు కూడా సమాచారం ఇవ్వండి. వానకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలు కొని మోసపోకండి. ఏ దుకాణంలో అయితే కొనుగోలు చేస్తారో తప్పకుండా బిల్లు తీసుకోండి. క్షేత్రస్థాయిలో పచ్చిరెట్టే, విత్తనాలు వెదజల్లే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగులో సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తాం” అని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య ‘నమస్తే’కు తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీ పుల్లయ్య స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల అమ్మకాన్ని నిరోధించేందుకు వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వానకాలం పంటల సాగుకు రైతులను అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. గత సీజన్ కంటే 8 వేల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయని, అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తే బిల్లులు తీసుకొని, దిగుబడులు పూర్తయ్యేదాకా భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వానకాలం పంటల సాగుపై డీఏవో బుధవారం ‘నమస్తే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయా..? ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగవుతున్నాయి.?
డీఏవో : జిల్లాలో గతేడాది కంటే ఈ సంవత్సరం వానకాలంలో పంటల సాగు విస్తీర్ణం 8 వేల ఎకరాలు పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది 5.63 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేయగా, ఈ సారి 5.71 లక్షల ఎకరాల్లో పండించనున్నారు. ఈ ఏడాది పత్తి క్వింటాలుకు రూ.12 వేల ధర రాగా, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయనున్నారు. ప్రధానంగా పత్తి 3.95 లక్షల ఎకరాలు, సోయా 89 వేల ఎకరాలు, కంది 61,750, జొన్న 4,500 ఎకరాలు, ఇతర పంటలను రైతులు సాగు చేసే అవకాశాలున్నాయి.
నమస్తే : విత్తనాలు, ఎరువుల పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఏవో : రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ సీజన్‌కు గాను పత్తి 11.85 లక్షల ప్యాకెట్లు, సోయా 30 వేల క్వింటాళ్లు, కంది 5 వేల క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాని ప్రణాళిక సిద్ధం చేశాం. ఏ మేరకు విత్తనాలు అవసరమవుతాయో గుర్తించి, డీలర్ల ద్వారా తెప్పించి రైతులకు విక్రయించేలా దుకాణాల్లో ఉంచుతున్నాం. విత్తనాల విక్రయాలను డీలర్లు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల విక్రయాలను ఎప్పుటికప్పుడూ తెలుసుకొని కొరత లేకుండా చూసే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో 94 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశాం. జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్‌స్టాక్ ఉంది. దుకాణాల్లో ఎరువుల విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి.
నమస్తే : రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఏవో : రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. గ్రామాల్లో, ఇతరుల వద్ద విత్తనాలు కొనవద్దు. బ్యాగుల సీల్, కంపెనీ ముద్ర, ప్యాకింగ్ తేది, ఎక్స్పైరీ తేదీ, ఎమ్మార్పీ ధర చూసుకోవాలి. దుకాణాల నుంచి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. పంట దిగుబడులు వచ్చేదాకా బిల్లును భద్రపర్చాలి. విత్తనాల లోపం కారణంగా పంటసరిగా రాకపోతే నష్టపరిహారం ఇప్పించే అవకాశాలున్నాయి. సీజన్లో రైతుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాం.
నమస్తే : నకిలీ విత్తనాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఏవో పుల్లయ్య : నకిలీ విత్తనాల విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. డీలర్లు, విత్తన దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి, నాణ్యమైనవి విక్రయించాలని సూచించాం. జిల్లాస్థాయిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, పోలీసు శాఖ నుంచి డీఎస్పీలతో కూడిన టాస్క్‌ఫోర్స్ టీం, మండలస్థాయిలో మండల వ్యవసాయ అధికారి, ఎస్ఐ, తహసీల్దార్‌తో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. వీరు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీ చేస్తారు. నకిలీ విక్రయాలు జరిగితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. గ్రామాల్లో సైతం రైతు బంధు సమితి సభ్యులు, ఏఈవోలు విత్తనాల విక్రయాలపై నిఘా ఉంచుతారు.
నమస్తే : పంటల సాగు, ఎరువుల వినియోగంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారా?
డీఏవో పుల్లయ్య : పంటల సాగులో భాగంగా రైతులకు వివిధ అంశాలపై 101 వ్యవసాయశాఖ క్లస్టర్లలోని రైతు వేదికల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. డీఏపీ ఎరువుల వాడకం తగ్గించేందుకు పీఎస్పీ (పాస్పరస్ సాలిబుల్ బ్యాక్టీరియా) విధానం ద్వారా భాస్వరం ఎరువులు మొక్కకు ఏ మేరకు అవసరమనే విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ విధానం ద్వారా హెక్టార్‌కు 1 యూరియా బస్తా వాడకం తగ్గుతుంది. పంటలకు ఎరువులను ఒకేసారి వేయకుండా అవసరం మేరకు వివిధ దఫాలుగా ఎలా వేయాలో తెలియజేస్తున్నాం. దీంతో పాటు పచ్చిరొట్ట వాడకం, విత్తనాలు వేదజల్లే పద్ధతిపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. రైతులు విత్తనాలు వేసే ముందు మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. సీజన్ ప్రారంభంలో తొందరపడకుండా భూమిలో తేమశాతం ఉన్న సమయంలోనే విత్తనాలు వేయాలి. రైతులకు ఎలాంటి సమస్యలున్నా గ్రామాల్లో ఏఈవోలను సంప్రదించాలి.