మంచిర్యాలటౌన్, మే 11: ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రతి పక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల సమీపంలోని వేంపల్లిలో ఉన్న ఎన్వీఎస్ ఫంక్షన్ హాలులో మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ జిల్లా లో బలమైన టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌ను తయారు చేస్తామని తెలిపారు.
రానున్న రోజుల్లో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బూత్ లెవెల్‌నుంచి జిల్లా స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి రాబోవు రోజుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. విపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలుచేసే వారికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను లెక్కలతో గట్టిగా సమాధానం చెప్పాలని తెలిపారు. ఈ సదస్సులో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పార్టీ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులున్నారు.
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
రామకృష్ణాపూర్, మే 11: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సూపర్ బజార్ సమీపంలో రామకృష్ణాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించబోయే శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయానికి చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలల్లో బాల్క సుమన్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయనను ఆర్యవైశ్య సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి సహకారం అందించిన మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వృత్తి సంఘాల గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కటకం నాగరాజు, పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు ఎల్లంకి సత్యయ్య, ఎల్లంకి భీమయ్య, బీరెల్లి నర్సయ్య, మారం శోభన్‌బాబు, మారం వేణుగోపాల్, కొలిపాక రామకృష్ణ, సంఘం మహిళలు పాల్గొన్నారు.