రామకృష్ణాపూర్, మే 11 : దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గిపోయి విద్యుత్ కొరత ఏర్పడిన దృష్ట్యా రవాణా వేగవంతం చేయాలని కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్విన్ అన్నారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సీహెచ్‌పీని బుధవారం జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి ఆయన సందర్శించారు. బొగ్గు రవానా సిస్టమ్, ట్రాక్ లైన్, మెరిట్ బంకర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2022-23 సంవత్సరానికి గాను మందమర్రి ఏరియాకు 54.5 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను సంస్థ నిర్దేశించిందన్నారు. రామకృష్ణాపూర్ సీహెచ్‌పీ ద్వారా 33.02 లక్షల టన్నుల రవానా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ప్రాజెక్టులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా బొగ్గు రవాణా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి రోజు ఆర్కేపీ సీహెచ్‌పీ నుంచి 3 రేకులు రవాణా చేస్తేనే వినియోగదారులను తృప్తిపర్చగలమని తెలిపారు. అలాగే చాలా రాష్ర్టాల్లో 6 నుంచి 8 గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారని, పరిశ్రమల్లో కూడా పవర్ సరఫరా లేదన్నారు. విద్యుత్ అంతరాయాన్ని తగ్గించేందుకు అన్ని ఏరియాలను సందర్శిస్తూ, కోల్మూవ్మెంట్ పెంచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్విన్‌కు జీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోఎం మార్కెటింగ్ సుందర్ రాజు, క్వాలిటీ డీజీఎం రామ్మోహన్రావు, సీహెచ్‌పీ డీజీఎం బాలాజీ భగవతీ ఝా, డీవై ఎస్ఈ చంద్రమౌళి, పిట్ కార్యదర్శి జే శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.