మంచిర్యాల ఏసీసీ, మే 10 :మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో నాలుగేండ్ల క్రితం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. జిల్లాతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలూ ఈ సెంటర్‌ను సద్వినియోగం చేసుకుంటుండగా, మెరుగైన సేవలతో బాధితులకు అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం పది చొప్పున యంత్రాలు, పడకలు ఉండగా, రోజుకు 42 మందికి రక్తశుద్ధి జరుగుతున్నది. కాగా, ఇటీవల బెల్లంపల్లిలో మరో సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులోకి వస్తే మరికొందరికి ఉపయోగపడనుంది.
ప్రభుత్వ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వసతులను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి పేదలకు వరంగా మారాయి. గతంలో డయాలసిస్ చేయించుకునే వారికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిసారీ వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో నాలుగేండ్ల క్రితం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లా బాధితులతోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులకు కూడా ప్రయోజనకరంగా మారింది.
24 గంటల వైద్య సేవలు..
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలోని డయాలసిస్ సెంటర్లో కిడ్నీ బాధితులకు నిత్యం సేవలు అందుతున్నాయి. ఈ బాధితులకు వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దవాఖానలో 101 మందికి పైగా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. దవాఖానలోని డయాలసిస్ సెంటర్లో 10 పడకలు, 10 యంత్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. సోమ, బుధ, గురు, శనివారాల్లో ఐదు షిఫ్ట్‌ల్లో, మంగళ, శుక్రవారాల్లో నాలుగు షిఫ్ట్‌ల్లో 12 మంది సిబ్బంది చొప్పున పైపులను మారుస్తూ ప్రతిరోజూ 42 మందికి డయాలసిస్ చేస్తున్నారు.
అలాగే ఎయిడ్స్, హెపటైటీస్ వ్యాధులతో బాధపడే వారికి ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేపి ఉచితంగా డయాలసిస్ చేస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఇందులో ప్రతిరోజూ యంత్రాలను శుభ్రం చేయడానికి గంట చొప్పున మొత్తంగా సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. త్వరలో అదనపు డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి వస్తుండడంతో మెరుగైన సేవలు అందనున్నాయి. డయాలసిస్ సేవలపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కూడా సంతోషం వ్యక్తం చేశారు. గత నెల 16న ఆయన జిల్లా ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. ప్రతి రోగితో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. బాధితులు చెప్పిన సమాధానంతో జిల్లా దవాఖాన అధికారులు, వైద్యులను అభినందించారు.
మరిన్ని సేవలు అందిస్తాం..
మంచిర్యాల జిల్లా ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందిం చేందుకు కృషి చేస్తున్నం. దూర ప్రాంతాల వారికి ఇబ్బం దులు కలుగకుండా చూస్తున్నాం. బెల్లంపల్లి, కాగజ్‌న గర్‌లో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. బెల్లంపల్లిలో త్వరలోనే టెండర్లను పిలిచి, పనులు ప్రారంభిస్తారు. డీ సెంట్రలైజేషన్లో భాగంగా ఒక చోటనే అన్ని సదుపాయాలు కాకుండా అక్కడక్కడా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో స్టాఫ్‌ను పెంచుకోగలుగుతాం. రోగులకు మంచి వైద్యం అందించగలుగుతాం.
– నూతన అరవింద్, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్.
బెల్లంపల్లిలో మరొకటి..
బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో, మరో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తేవాలని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావును జిల్లా వైద్యాధికారులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన, బెల్లంపల్లిలోని ప్రభుత్వ దవాఖాన, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఐదు పడకలతో కూడిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు వైద్య విధాన పరిషత్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అందుబాటులోకి వస్తే మరి కొంత మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధునిక వసతులతో కూడిన మాతా శిశు సంరక్షణ కేంద్రం తోపాటు డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ కేంద్రాలతో మరెన్నో మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.