నిర్మల్ టౌన్, మే 10: నిర్మల్ జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో మంత్రి అల్లోలను కలిసి సన్మానం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి జిల్లాలో పదో తరగతి ముల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, రఘునాథ్ పాల్గొన్నారు.
మూల్యాంకన కేంద్రం పరిశీలన
నిర్మల్ అర్బన్, మే 10 : నిర్మల్ జిల్లాకు మంజూరైన పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని డీఈవో రవీందర్ రెడ్డి, పరీక్ష సహాయ కమిషనర్ సిద్ద పద్మ మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాల పదో తరగతి మూల్యాంకన కేంద్రానికి అనువుగా ఉందని వారు తెలిపారు. గతంలో ఇక్కడ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. గదులు, ఫర్నిచర్, విద్యుత్, ఇతర వసతులపై పాఠశాల ప్రిన్సిపాల్‌తో చర్చించారు. ఈ కేంద్రంలో మూల్యాంకనానికి చేయాల్సిన ఏర్పాట్లపై పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, సూపరింటెండెంట్ భోజన్నకు వివరించారు. వారి వెంట విద్యాశాఖ అధికారులు ఉన్నారు.