ఆసిఫాబాద్, మే 10 : జిల్లాలోని వట్టివాగు, కుమ్రం భీం ప్రాజెక్టుల కింద చేపట్టిన కాలువ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం కుమ్రం భీం ఎడమకాలువ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ అధికారులు, నవయుగ కంపెనీ కాంట్రాక్టర్స్, ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులను వెంటనే ప్రారంభించి, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎడమ కాలువ 13.38 కిలో మీటర్ల మేర పనులు పూర్తయితే సుమారు 45 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వెల్లడించారు. ఆ దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఈఈ గుణవంతరావు, తదితరులున్నారు.
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని వైద్యులను కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. మంగళవారం దవాఖానలో నిర్వహించిన సదరం క్యాంపును తనిఖీ చేశారు. అనంతరం దవాఖానను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి కాన్పు ప్రభుత్వ దవాఖానలోనే జరిగేలా చూడాలన్నారు. దవాఖానతో పాటు ఆవరణను శుభ్రంగా ఉంచాలన్నారు. రికార్డులు పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.