జైపూర్, మే 10: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. మంగళవారం జైపూర్ మండలంలోని మిట్టపల్లి, ముదిగుంట గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మండలంలో మొదటి విడుతలో గుర్తించిన పాఠశాలలను అధికారులు సందర్శించి, సమస్యలను గుర్తించాలన్నారు. వెంటనే పనులు చేపట్టి, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి సూచనలు చేశారు. మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోదారి రమాదేవి, ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీవో బాలయ్య, సర్పంచ్లు సౌమ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పనులో నాణ్యత పాటించాలి
వేమనపల్లి, మే 10 : ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలలో చేపడుతున్న పనులను వేగవంతంగా, నాణ్యతతో చేపట్టాలని సంబంధిత అధికారులను మంచిర్యాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి ఆదేశించారు. మంగళవారం వేమనపల్లి గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన వెంట అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, ఎంఈవో తిరుపతిరెడ్డి, ఏఈ రాజేశ్వర్రెడ్డి, ఏపీవో సత్య ప్రసాద్ ఉన్నారు.