నెన్నెల, మే 8;గతంలో తన సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం కేసీఆర్‌కు తెలిసేలా చేసి, స్వయంగా ముఖ్యమంత్రే ఫోన్ చేయడంతో వార్తల్లో నిలిచాడు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి వాసి కొండపల్లి శరత్. ఇప్పుడు మరోసారి తనకొచ్చిన వినూత్న ఆలోచనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా తన పంట ఉత్పత్తులు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దళారీకి లాభం చేకూర్చే కంటే, నేరుగా వినియోగదారుడికే విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటివరకు మామిడి, మిర్చి, బియ్యం మాత్రమే సరఫరా చేస్తుండగా.. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకూ
రవాణా చేస్తున్నాడు.
ఆయనో యువరైతు. ఏటా పలు రకాల పంటలు పండిస్తుంటాడు. చేతికొచ్చిన పంటను మొదట్లో దళారులకు విక్రయించేవాడు. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లని పరిస్థితి. దీంతో ఒక వినూత్న ఆలోచన ఆయనకు తట్టింది. దళారీకి కాకుండా నేరుగా వినియోగదారుడికే తన పంట ఉత్పత్తులు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సామాజిక మాధ్యమాల ద్వారా తన బిజినెస్‌ను మొదలుపెట్టాడు. ఇదివరకే చాలా మంది రైతులకు ఫేస్బుక్ ద్వారా సలహాలు ఇస్తుండడం ఆయనకు కలిసొచ్చింది. పండిన పంటలను నేరుగా కొనుగోలుదారుకే చేరేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. బియ్యం, మిర్చి, మామిడి పంటలను ఇలానే అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు.
దళారులకు విక్రయిస్తే..
పండినపంటను దళారులకు విక్రయిస్తే కనీస ధర కూడా రావడం లేదు. నాగ్‌పూర్ మార్కెట్‌కు తీసుకుపోతే అక్కడ వేలం ద్వారా పంటను అమ్ముకోవాల్సి వస్తుంది. వేలంలో దళారులదే రాజ్యం. చేతి రుమాలు మాటున బేరం నడుస్తుంది. దీంతో ఎంత బేరం అయ్యిందో కూడా రైతుకు తెలియదు. ప్రస్తుతం అక్కడ కిలో మామిడి బంగెనపల్లి రూ.55 నుంచి 65 వరకు ఉంది. రానుపోను ట్రాన్స్‌పోర్టు ఖర్చులు,పది శాతం దళారీ కమీషన్ , తూకంలో కోత, క్వింటాల్‌కు ఐదు కిలోల వరకు తరుగు, ఇలా వచ్చిన ధరలో సగం వాటికే పోతుంది. దీంతో రైతుకు మిగిలేది ఏమీ లేదు. ప్రస్తుతం శరత్ ఐడియాతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులే తప్పా, కమీషన్లు, కోతలు ఉండవు.
సీఎం కేసీఆర్ ఫోన్‌తో పెరిగిన ఫాలోవర్స్..
యువరైతు శరత్ గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ ఫేస్బుక్ ద్వారా ఓ వీడియో విడుదల చేశాడు. వేలాది మంది దీన్ని షేర్ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్, నేరుగా శరత్‌కు ఫోన్ చేశాడు. తన సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, ఉన్నతాధికారులను పురమాయించారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది. అప్పటి నుంచి శరత్‌కు ఫేస్బుక్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఇది కూడా కలిసివచ్చింది.
ప్రణాళికతో సక్సెస్
శరత్ పండించిన ఉత్పత్తుల వివరాలను ఫేస్బుక్, వాట్సాప్‌లో అమ్మకానికి పెడుతాడు. మంచిర్యాల నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు రోడ్డు మార్గంలో ఉన్న పట్టణాల్లో విక్రయానికి సిద్ధం చేసుకుంటాడు. కావాల్సిన వారు సంప్రదిస్తే నేరుగా ఇంటికే వచ్చి అందజేస్తుంటాడు. బియ్యం అమ్మకాల సమయంలో ముందుగా అర్డర్ తీసుకొని మిల్లులో పట్టించి, హైదరాబాద్ వరకూ తీసుకెళ్లి విక్రయిస్తాడు. ఎక్కడెక్కడ ఆర్డర్లు తీసుకున్నాడో వారికి నేరుగా ఇంటికే డెలివరీ చేసి వస్తాడు. నేరుగా రైతు నుంచే బియ్యం అనేసరికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. రేటు కొంత ఎక్కువైనా కొంటామంటూ పలువురు ముందుకు వస్తున్నారు. బియ్యంతోపాటు మిర్చి కూడా విక్రయిస్తున్నాడు. ఒక్కోసారి ఆర్టీసీ కార్గో సేవలనూ సద్వినియోగం చేసుకుంటున్నాడు.
మామిడికి భలే గిరాకీ
మామిడి కాయలను దళారులకు విక్రయిస్తే అనుకున్నంత ధర రావడం లేదు. దీంతో శరత్ తానే స్వయంగా మార్కెటింగ్ చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. ఎలాంటి మందులు వాడకుండా పండించిన పంటను మంచి లాభాలతో అమ్ముతున్నాడు. వారం కిందట ఫేస్బుక్లో ‘మన వ్యవసాయం మన పంటలు మీ శరత్ అనే పేరిట మామిడి పంటల వివరాలను అప్లోడ్ చేశాడు. ఆర్గానిక్ మామిడి పంట కోస్తున్నాను.. కావల్సిన వారు సంప్రదించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆర్గానిక్ మామిడి కాయలు కావడంతో వందలాది మంది కిలోల చొప్పున ఆర్డర్లు ఇస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం కాయలను కోసి పెట్టెల్లో నింపి హైదరాబాద్‌కు తీసుకుపోయి డోర్ డెలివరీ చేస్తున్నాడు. మార్కెట్లో కిలో మామిడి రూ.100 నుంచి 150 వరకు ధర ఉంటుంది. కానీ శరత్ కిలోకు రూ.80 మాత్రమే తీసుకుంటున్నాడు. మంచిర్యాల నుంచి మొదలుకుని హైదరాబాద్ వరకు ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ వస్తున్నాడు. రెండు రోజుల్లో పది టన్నుల మామిడి కాయలను విక్రయించాడు.
ముందుగానే ఆర్డర్లు తీసుకుంటా..
పండిన పంటను ఫేస్బుక్, వాట్సప్ పరిచయాల ద్వారా అమ్ముతున్నా. ఇలా చేస్తే అనుకున్నంత గిట్టుబాటు ధర కూడా వస్తున్నది. కొనుగోలుదారులు కూడా మార్కెట్లో ఉన్న దానికంటే కొంత తక్కువ ధరకే అమ్మడంతో సంతోషంగా తీసుకుంటున్నారు. కల్తీ లేని పంటను అమ్ముతున్నా. బియ్యంతో పాటు మిర్చి పంటను కూడా ఇలాగే ఆర్డర్ల ద్వారా విక్రయించా. మామిడి కాయలను కావాల్సినవారి ఇంటికి పంపిస్తున్నా. ఆర్టీసీ కార్గో సేవలను కూడా వినియోగించు కుంటున్నా. ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నా. రెండేండ్లుగా ఆన్లైన్ ద్వారానే పంటను అమ్ముతున్న. దళారీ వ్యవస్థకు దూరంగా ఉండాలనే ఈ ఐడియాతో పంటలను విక్రయిస్తూ లాభం గడిస్తున్నా.
–శరత్, రైతు