నిర్మల్ అర్బన్, మే 8 : ఆయిల్ పాం సాగుకు మన నేలలు అనుకూలమని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సాగు వైపు రైతులు దృష్టి పెట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆయిల్ పాం సాగు, స్థితిగతులపై అవగాహన కోసం నిర్మల్ ప్రాంత రైతులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజక వర్గంలో పర్యటించారు. నిర్మల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేయనున్నట్లు తెలిపారు.తొలుత దమ్మపేట గ్రామంలో పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించారు. రైతులు పామాయిల్ గింజలను ఫ్యాక్టరీకి ఎలా తరలిస్తున్నారు, ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు, టన్నుకు నూనె దిగుబడి ఎంత వస్తున్నది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వాణిజ్య పంటలు, ప్రత్యేకంగా ఆయిల్ పాం సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో వంట నూనెల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. వచ్చే జూన్ తర్వాత 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేసేందుకు రైతులకు మొక్కలు సిద్ధంగా ఉంచామని అన్నారు. నిర్మల్ జిల్లాలో వానకాలంలో 3 వేల ఎకరాలు, యాసంగిలో 7 వేల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించకున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలు, బిందు సేద్య పరికరాలు, అంతర పంటలకు విత్తనాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. వానాకాలం పంటకు ఆర్మూర్ నియోజక వర్గం చేపూర్ నర్సరీ నుంచి, యాసంగి పంటకు సారంగాపూర్ మండలం బీరవెల్లి నర్సరీ నుంచి మొక్కలను తెప్పించి రైతులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అశ్వరావు పేట ఎమ్మెల్యే నాగేశ్వర్రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాం రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, ఎంపీపీలు రామేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీల చైర్మన్లు రవీందర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, మండల కన్వీనర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, 300 మంది రైతులు పాల్గొన్నారు.