బెజ్జూర్, మే 8 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని కుశ్నపల్లి కూరగాయల సాగుకు చిరునామాగా నిలుస్తున్నది. ఈ గ్రామంలో 324 కుటుంబాలు ఉండగా.. 1,302 మంది జనాభా ఉన్నారు. 354 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా.. 313 మంది రైతులు ఉన్నారు. ఇందులో 210 కుటుంబాలు బారె(మాలీ) కులానికి చెందినవారు. వీరు 50 ఏండ్లుగా కూరగాయలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒక్కో ఎకరంలో నాలుగైదు రకాల కూరగాయలు పండిస్తారు. ప్రధానంగా కొత్తిమీర, వంకాయ, టమాట, బెండ, అలసంద, చిక్కుడు, కాకర, క్యాబేజీ, ఆకు కూరగాయలు సాగు చేస్తారు. తెలంగాణకు సరిహద్దుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని అహేరీ పట్టణ సంతకు తీసుకెళ్లి విక్రయిస్తారు. రాత్రిళ్లు క్వింటాళ్ల కొద్ద్దీ కూరగాయలు సిద్ధం చేసుకొని తెల్లవారు జామున 4 గంటలకే ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాలపై వెళ్తారు.
అహేరీ పట్టణంతోపాటు చుట్టు పక్కల ఉన్న ఆలపల్లి, బుజంగరావుపేట, వంగెపల్లి, వెంకటరావు పేట, గడి అహేరీ, నాగెపల్లి, మహాగాం, ఇందారం, చేర్పల్లి తదితర గ్రామాల ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్తారు. అహేరీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూరగాయలు పండించకపోవడం, తాజా వెజిటేబుల్స్ లభిస్తుండడంతో మన కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో రైతు సుమారు రోజుకు రూ.2వేలు సంపాదిస్తాడు. అందరూ రైతులు కలిపి నెలకు కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
నదిపై బ్రిడ్జి కట్టాక సౌలత్ అయింది
నాడు కూరగాయలు మహారాష్ట్రకు తీసుకపోకట బాగా గోస అయ్యేది. కానీ మోయేడే కేసీఆర్ సారు ప్రాణహిత నదిపై బ్రిడ్జి కట్టించినంకా మాకు గోస తప్పింది. ఎడ్ల బండ్లతో నదిదాకా పోయి ఎడ్లబండ్లను, పడవలమీద నది దాటించడం కోసం చెప్పరానీ తిప్పళ్లు పడేవాళ్లం కానీ ఇప్పుడు ఎడ్ల బండ్లు బందు చేసి మోటరు బైకులు తీసుకున్నాం. ముళ్లెల్లో కూరగాయలు పెట్టుకొని బుర్రుమని అహేరీదాకా మోటారుబైకు పైనే పోతున్నాం.పొద్దంతా కూరగాయలు అమ్ముకొని పొద్దుగూకాక ఇంటికస్తున్నం. బ్రిడ్జి లేక ఎడ్లబండ్లతో నడిజాము దాకా ఇంటికి వచ్చేటోళ్లం. మా గోస చూసి మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బ్రిడ్జి కోసం కేసీఆర్ సారు దగ్గర బతిమిలాడితేనే బ్రిడ్జి అయింది.
–గుర్నులే శ్యాంరావు, రైతు కుశ్నపల్లి
పంటల కంటే కూరగాయల్లోనే లాభం ఉన్నది
నా పేరు చౌదరి సాయి, నాది కుశ్నపల్లి. మా ఊళ్లో అందరూ కూరగాయలే పండిస్తరు. నాకు 3 ఎకరాలు భూమి ఉన్నది. ఒక్క ఎకరంలో పత్తి లేదా వరి పంట వేస్తాను మిగిలిన రెండు ఎకరాల్లో కూరగాయలే పండిస్తా. పంటలు పండినా పండక పోయినా కొంత కష్టపడాలేకానీ కూరగాయలు మాత్రం తప్పకుండా పండుతాయి.ఒక్కోసారి పంటలకు ధరలు ఉండవు. కానీ కూరగాయలకు మంచి ధర ఉండి లాభాలు కూడా మంచిగానే ఉంటాయి. అందుకే పంటలకంటే కూరగాయలే ఎక్కువ పండిస్తం. రెండు ఎకరాల్లో అన్నిరకాల పంటలు వేస్తా మిర్చి, బెండ కాయ, కాకరకాయ, వంకాయ, టమాటలు పండుతయ్. మాకు కూరల కోసం ఎలాంటి తిప్పలు రావు. పైగా వీటిని అమ్మితే లాభాలు వస్తాయి.