దండేపల్లి, మే8 : వారంతా గొప్ప చదువులు చదువుకున్నోళ్లే.. డిగ్రీ పట్టాలు అందుకున్నోళ్లే.. కానీ, చిన్నతనం నుంచి చూస్తున్న పొలాల్లోనే తమ ఉజ్వల భవిష్యత్‌ను వెతుక్కున్నారు. తమ ఆలోచనలకు ఆధునికతను జోడిస్తూ , సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఉపాధి అంటే ఉద్యోగమే కాదు..వ్యవసాయం కూడా అంటూ సాగుతున్నారు. మంచి దిగుబడులు సాధిస్తూ మరికొందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మండలంలోని పలువురు విద్యావంతులు విభిన్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాల కోసం ఎదురు చూడ కుండా సొంత కాళ్లపైనే నిల్చుంటున్నారు. మార్కె ట్లో డిమాండ్ ఉన్న విభిన్న పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చేసే వ్య వసాయం ఎంత లాభసాటిగా ఉండాలో నిరూపి స్తున్నారు. సేంద్రియ విధానాన్ని పాటిస్తూ, నేల తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.
ఆత్మ విశ్వాసమే ఆయుధంగా..
దండేపల్లి మండల కేంద్రానికి చెందిన యువ రైతు బొమ్మెన మహేశ్ రెండు విశ్వ విద్యాలయాల్లో పీజీ పట్టాలు అందుకున్నాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రం, శాతవాహన విశ్వ విద్యాలయం నుంచి సోషియాలజీ ఎంఏ పట్టా అందుకున్నాడు. బీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించాడు. డీఎస్సీలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పోయినా నిరాశ చెందలేదు. మహేశ్ తనకున్న నాలుగెరాల్లో ఎకరన్నరలో మామిడితోట, రెండు ఎకరాల్లో వరి, అర ఎకరంలో కూరగాయలు పండిస్తున్నాడు. అలాగే ఇంటి వద్దనే మినీ డైరీ నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు సలహాలు ఇస్తుంటాడు. ఉద్యోగ ప్రయత్నంలో విఫలమైనా నిరాశపడకుండా వ్యసాయం, మామిడితోటలు, డైరీ నిర్వహిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు.
నేలతల్లిని నమ్ముకొని..
దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన యువరైతు బనావత్ శివలాల్ హైదరాబాద్ ఇస్లామియా కళాశాలలో బీఈడీతో పాటు, గోదావరిఖనిలో పీజీ చేశాడు. 2017లో డీఎస్సీ రాయగా కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగానికి దూరమయ్యాడు. తనకున్న నాలుగెకరాల పొలంలో వరి, ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నాడు. ఉద్యోగం రాలేదని ఏనాడూ నిరాశ చెందకుండా సేద్యం పండుగ అని నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం యాసంగిలో వరితో పాటు ఇతరత్రా పంటలు సాగు చేశానని, ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నాడు. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకొని, తోటి రైతులకు ఏ మందులు వాడాలో చెబుతుంటాడు. చదువుకున్న వాళ్లంతా ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడం మంచిదని శివలాల్ యువతకు సూచిస్తున్నాడు. ముఖ్యంగా యువత సమయం వృథా చేయకుండా వ్యవసాయం చేస్తూ స్వయం ఉపాధి పొందాలని సలహా ఇస్తున్నాడు.