కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతేడాది కంటే రూ. 10 కోట్ల నిధులను అదనంగా అందించేలా రుణ ప్రణాళికలు రూపొందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 47 కోట్లతో రుణ ప్రణాళికలు అమలు చేయగా, ఈ ఏడాది రూ. 57 కోట్లతో అమలు చేయనున్నారు. దీంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త యూనిట్లను కూడా అందించే అవకాశాలు కలుగునున్నాయి.
జిల్లాలోని మహిళా సంఘాల..
2022-23 ఆర్థిక సంత్సరంలో జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 57 కోట్లను బ్యాంకు లింకేజీల ద్వారా అందించనున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా పొదుపు సంఘాలకు రుణాలు అందించనున్నారు. కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకొని లాభాల బాటలో పయనించేలా చర్యలు సైతం తీసుకోనున్నారు.
పెద్ద ఎత్తున రుణాలు..
మహిళల స్వయం ఉపాధి కోసం పెద్ద ఎత్తున రుణాలను ఇవ్వనున్నారు. 100 డెయిరీ యూనిట్లను అమలు చేయనున్నారు. ఆసక్తి గలవారికి గేదెలను అందించనున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆటోలు 20, గ్రీన్ హౌజ్ 4, వెజిటేబుల్ డెవలప్ మెంట్ యూనిట్లు 8, జనరిక్ మెడికల్ యూనిట్లు 2 ఏ ర్పాటు చేయనున్నారు. ఇవేగాకుండా 20 స్మాల్ మార్ట్ షా పులు, సోలార్ పవర్ యూనిట్లు 50 ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో మరో 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో రుణా లు తీసుకున్న మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేలా అధికారులు తోడ్పాటు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ వ్యాపారాలను విజయవంతంగా సాగిస్తున్నారు.
సభ్యులందరికీ అందేలా చర్యలు..
గతేడాది రూ. 47 కోట్లతో రుణ ప్రణాళికలు అమలు చేయగా, 98 శాతం లక్ష్యాన్ని అధికారులు పూర్తిచేశారు. జిల్లాలోని 15 మండలాల్లో 397 గ్రామైక్య సంఘాలు ఉండగా, వీటిలో 79 25 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో సు మారు 8,266 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీరందరకీ రుణాలు అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.