ఆదిలాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో మొరం తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తలమడగు మండలంలోని కజ్జర్ల, బరంపూర్, మావల మండల శివారు, బట్టి సవర్గాం.. తాంసి మండలంలోని పొన్నారితోపాటు ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో మొరం అధికంగా ఉంటుంది. తవ్వకాలు జరుపాలంటే రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరి. అవేమీ లేకుండా దళారులు సర్కారు భూముల్లో తవ్వకాలు చేపడుతూ అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతున్నది. చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం మా బాధ్యత కాదంటే.. మా బాధ్యత కాదంటూ ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటున్నారు. అక్రమంగా మొరం తవ్వకాల విషయంలో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మొరం తవ్వకాలను నిలిపివేయాలని స్థానిక గ్రామాలవారు కోరుతున్నారు.
గృహ, రహదారులు ఇతర నిర్మాణాలకు మొరం అవసరమవుతోంది. స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా పొలాలను ప్లాట్లుగా మార్చడానికి చేపట్టిన తవ్వకాల్లో దీనిని వినియోగిస్తున్నారు. మొరం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి రెవెన్యూ వారు ఎన్వోసీ ఇచ్చిన తర్వాత మైనింగ్ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. పట్టా భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టాలంటే హెక్టారుకు రూ.40 వేల చొప్పున మైనింగ్ శాఖకు డిపాజిట్ చేయాలి. మొరం తవ్వడానికి క్యూబిక్ మీటర్‌కు రూ.30 చొప్పున చెల్లించాలి. దీంతో పాటు రెండు శాతం ఆదాయ పన్ను, ఒక శాతం కార్మిక పన్ను కట్టాలి. అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ.. ఆదిలాబాద్ జిల్లాలో మైనింగ్ శాఖ నుంచి ఏ ఒక్క క్వారీకి అనుమతులు లేవని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవిశంకర్ తెలిపారు.
యథేచ్ఛగా తవ్వకాలు..
దళారులు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడగు మండలంలోని కజ్జర్ల, బరంపూర్, మావల మండల శివారు, బట్టి సవర్గాం.. తాంసి మండలంలోని పొన్నారితోపాటు ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో మొరం తవ్వకాలు జరగుతున్నాయి. దళారులు ఎక్స్కవేటర్లతో తవ్వకాలు జరుపుతూ రోజు వందలాది టిప్పర్లలో మొరం తరలిస్తున్నారు. పొలాలు, గ్రామాల మధ్యలో నుంచి మట్టి రోడ్లను నిర్మించుకొని వాహనదాల ద్వారా తరలిస్తున్నారు. పెద్ద మొత్తంలో మొరం తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు మొరం తవ్వకాల విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానిక గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
ఎవరిదీ బాధ్యత..
ఆదిలాబాద్ జిల్లాలో మొరం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంటున్నారు. మొరం తవ్వకాలను మైనింగ్ అధికారులు చూసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు. అయితే అక్రమ తవ్వకాలను నిలిపివేసే బాధ్యత రెవెన్యూ వారికే ఉంటుందని, వారు ఎన్వోసీ ఇస్తే తాము అనుమతులు మంజూరు చేస్తామని మైనింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారుల సమన్వయం లేకపోవడంతో మొరం తవ్వకాలకు అడ్డుకట్టపడడం లేదని బాధిత గ్రామాల ప్రజలు అంటున్నారు. గ్రామ శివార్లలో తవ్వకాలు జరపడంతో వానకాలంలో వాటిలో నీరు చేరుతున్నదని, అందులో పడి స్థానిక గ్రామాల ప్రజలు, పశువులు మరణిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అక్రమంగా మొరం తవ్వకాల విషయంలో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మొరం తవ్వకాలను నిలిపివేయాలని వారు కోరుతున్నారు.