మంచిర్యాల ఏసీసీ, మే 7 : తలసేమియా ఓ ప్రాణాంతక వ్యాధి. రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో ఈ వ్యాధి సోకుతుంది. పుట్టినప్పటి నుంచే వస్తుండడంతో చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పక్షం రోజులకోమారు రక్తం తప్పకుండా ఎక్కించుకోవాల్సిన దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీరి తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా చాలా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిని సర్కారు ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఒక్కో రోగికి నెలకు రూ.6 వేల ఖర్చులు తప్పుతున్నాయి. ఇప్పటికే సర్కారుతోపాటు స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధానంగా మానవతావాదులు ముందుకొచ్చి తలసేమియా చిన్నారులకు అవసరమైన రక్తదానం చేసి ఆదుకోవాల్సిన అవసరముంది. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
వారసత్వంగా వచ్చే అవకాశాలు అధికం
చిన్నారులకు తలసేమియా వారసత్వంగా సోకే అవకాశం అధికం. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి ఉన్నా పిల్లలకు వస్తుంది. ఇది ఆల్ఫా, బీటా అనే రెండు రకాలుగా ఉంటుంది. వీటిలో మార్పులు జరిగినప్పుడు మైనర్ దశలో వ్యాధిని గుర్తించవచ్చు. వీరు వ్యాధిగ్రస్తులు అయినప్పటికీ వీరికి రక్త మార్పిడి అవసరం ఉండదు. కానీ.. వ్యాధి తీవ్రతతో బాధపడుతుంటారు. వీరి నుంచి వారి పిల్లలకు వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక శాతం మేజర్‌గా ఉన్న దశలో రక్తంలో హిమోగ్లోబిన్(హెచ్‌బీ) తగ్గుతుంది. దీనితో వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీరు కనీసం 10.5 గ్రాముల శాతం రక్తం ఉండేలా చూసుకోవాలి. వీరు ఎక్కువగా జ్వరం, ఆకలి, కామెర్లు, మూత్రం పసుపు రంగులోకి రావడం, ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. హిమోగ్లోబిన్ తగ్గడంతో మనిషి ఎదుగుదల ఆగిపోవడంతోపాటు ఎముకల సాంద్రత తగ్గి ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాధిగ్రస్తులు కాల్షియం మందులు, ఎముకలు బలపరిచే ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
సేవలు అమోఘం..
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలోని ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. దీని ఆధ్వర్యంలో పరికరాలు అందుబాటులో ఉండగా.. రోగులకు ఉచిత వైద్య పరీక్షలు అందుతున్నాయి. రక్తనిధి కేంద్రాన్ని 2008 సంవత్సరంలో ప్రారంభించగా.. ఇప్పటివరకు 1,043 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 84,593 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఇందులో రక్తహీనతతో బాధపడుతున్న వారికి 16,099 యూనిట్లు.. గర్భిణులు, డయాలసిస్ బాధితులకు 19,039, నిరుపేద కుటుంబాలకు 3,907 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో 717 మంది తలసేమియా బాధితులు ఉండగా.. ప్రతినెలా 180-200 మందికి ఉచితంగా రక్తాన్ని ఎక్కిస్తున్నారు.
బాధితులకు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు చర్చలు..
తలసేమియా బాధితులకు సదరన్ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. దీని ద్వారా వారికి నెలకు రూ.3వేల పింఛన్ అందే అవకాశం ఉంది. క్యాంపులను నిర్వహించి పేదపిల్లకు డీఎన్ఏ పరీక్షలు చేసి వ్యాధి ఉన్నట్లయితే వారికి ఆరోగ్య శ్రీ ద్వారా మందులను అందిస్తున్నాం. నేడు(ఆదివారం) మంచిర్యాల ఎఫ్సీఏ కమ్యూనిటీ హాలులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఇందులో దివ్యాంగుల సర్టిఫికెట్, వ్యాధిపై అవగాహన కల్పిస్తాం.
– కంకనాల భాస్కర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి చైర్మన్,మంచిర్యాల.