మంచిర్యాల, మే 7(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్;బిడ్డ కడుపులో పడ్డది మొదలు, అమ్మ ఎన్నో కలలు కంటుంది. నవమాసాలు మోసి, రక్తమాంసాలు పంచుతుంది. తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మని స్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి, ప్రసవవేదనను మరచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వ పెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదుల మీద మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకో గలం? కనిపించే ఆ దైవానికి ఎలా కృతజ్ఞతలు చెప్పగలం?.. నేడు మాతృదినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం
అన్నీతానై..
ఈ చిత్రంలో కనిపిస్తున్న మాతృమూర్తి మాసవేని లక్ష్మి. ఈమె భర్త లింగయ్య. సింగరేణిలో కార్మికుడిగా విధులు నిర్వహింవారు. వీరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని 65 డీఫ్ ఏరియా క్వార్టర్స్‌లో నివాసముండేవారు. 1998లో శాంతిఖని గనిలో జరిగిన ప్రమాదంలో భర్త లింగయ్య మృతి చెందారు. అప్పటి నుంచి ఇంటి భారమంతా లక్ష్మి మీదే పడింది. వీరికి నలుగురు ఆడపిల్లలే. 24 ఏండ్లుగా బెల్లంపల్లి సింగరేణి సివిల్ డిపార్టుమెంటులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. 2010లో పెద్దబిడ్డ రజితను తిరుపతికి, రెండో బిడ్డ సునీతను 2016లో హుజూరాబాద్‌కు చెందిన శివకుమార్‌కు ఇచ్చి పెండ్లి చేసింది.
మూడో కూతురు జ్యోతి ప్రస్తుతం పీఈటీగా యువ సంఘటన పాఠశాలలో పని చేస్తుండగా, నాలుగో కూతురు వనిత సిర్పూర్(టీ)లోని ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ హై స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నది. ఇద్దరు కూతుర్ల పెండ్లి చేసిన లక్ష్మి మరో ఇద్దరు కూతుర్లు క్రీడల్లో రాణిస్తుంటే ప్రోత్సహించింది. వారిద్దరూ జాతీయస్థాయి పోటీల్లో రాణించి ప్రస్తుతం పీఈటీలుగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త దూరమైనా ఆ కుటుంబానికి ఏ లోటూ ఉండొద్దని కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
నేపథ్యం..
యేటా మే నెల రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావించి యేడాదికోసారి నివాళులర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపారు. ‘జూలియవర్డ్ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. బోస్టన్‌లో ఇందుకోసం సమావేశాన్ని నిర్వహించింది.
అన్న మేరీ జర్విస్ అనే మహిళ ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ జరిపించేందుకు చాలా కృషి చేసింది. ఆమె 1905 మే 9న మృతి చెందగా, ఆమె కూతురు మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ర్టాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి యేటా మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
త్యాగానికి చిరునామా
కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా. అమ్మ అనే పిలుపులోనే తీయదనం ఉంది. తన కడుపు మాడ్చుకొని, మన కడుపు నింపుతుంది. కాయకష్టం చేసి, మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే మన నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా, బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసమే పరితపిస్తూ ఉంటుంది. కన్నపేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా నిలువెల్లా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి మనల్ని ప్రయోజకుల్ని చేస్తుంది.