దస్తురాబాద్, మే 7: మహిళలు పిల్లల ఆలనాపాలన చూడడం, ఇంటి పనులు చక్కదిద్దుకోవడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. వారు కష్టపడుతూ ఇంటి ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ మహిళలు శ్రామిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ మేము సైతం అంటూ పురుషులతో సమానంగా చెమటోడ్చి వారి కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. మండల వ్యాప్తంగా గ్రామీణ హామీ పథకంలో మహిళలే అధికంగా పనులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు ఐదు వేల మందికి పైగా కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా.. అందులో సుమారు 75 శాతం మహిళామణులే ఉపాధి పనులకు వస్తున్నట్లు పేర్కొంటున్నారు.
గ్రామీణ మహిళలకు వరంగా..
గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు, మహిళలకు తగిన పనులు దొరకడం కష్టంగా ఉండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభంలో పురుషులే అధికంగా పనులకు వెళ్లేవారు. పెరిగన ధరలు, ఆర్థిక అవసరాలు, పిల్లల పోషణ తదితర కుటుంబ అవసరాలు పురుషుల పనితో వచ్చే ఆదాయం సరిపోక గ్రామీణ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఉపాధి హామీకి వెళ్లి చేసిన పనికి వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఆర్థికంగా అండగా..
కొన్నేండ్ల నుంచి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా. కూలీగా వచ్చిన డబ్బులను ఇంటి అవసరాల కోసం వినియోగిస్తున్నా. ఉన్న ఊర్లోనే పని చేసి ఉపాధి పొందడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ప్రతి ఏడాది వంద రోజులు పని చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఊరట పొందుతున్నాం.
– బొమ్మెన శమంత, ఉపాధి హామీ కూలీ
కూలీలందరికీ పని..
మండలంలో కొనసాగుతున్న ఉపాధి పనులకు ప్రసుత్తం పెద్ద సంఖ్యలో కూలీలు పనులకు వస్తున్నారు. పురుషుల కంటే మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పనులు కావాలని అడిగిన వారందరికీ కల్పిస్తున్నాం. ఇది అభినందించాల్సిన విషయం. మహిళా కూలీల పాత్ర కీలకంగా ఉంది. అన్ని రకాల పనుల్లో మహిళలు వెనుకాడకుండా పాల్గొంటున్నారు.
– రవి ప్రసాద్, ఏపీవో, దస్తురాబాద్