యైటింక్లయిన్ కాలనీ, మే 7 : జాతీయ కార్మిక సంఘాల నాయకులు సమావేశాల్లో తమ అసత్య ప్రచారాలతో కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ఎవరూ నమ్మబోరని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు అన్నారు. ఆర్జీ-2 డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన వకీలుపల్లి గనిపై శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నుంచి 50 మంది టీబీజీకేఎస్‌లో చేరారు. కాగా, వారికి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మిక వర్గంపై ఉన్న ప్రేమతో వారసత్వ ఉద్యోగాలు ప్రకటిస్తే, ఓ జాతీయ సంఘం తమ కార్యకర్తతో కోర్టులో కేసు వేయించిందని ఆరోపించారు. దానిని సైతం పరిష్కరించి, 10 వేల మందికిపైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా సింగరేణిలో అనేక హక్కులు పోగొట్టిన జాతీయ కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో తమ ఘనతలు ఏమీ చెప్పుకోలేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. ఇందుకు వారు అబద్ధాలతో ప్రచారం చేస్తూ టీబీజీకేఎస్‌ను బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీబీజీకేఎస్ గెలిచిన నాటి నుంచి 60కి పైగా హక్కులు సాధించిందని స్పష్టం చేశారు. అలాగే జాతీయ సంఘాలు పెండింగ్‌లో పెట్టిన 3,400 డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇప్పించినట్లు చెప్పారు. అలాగే ఎక్స్టర్నల్ ద్వారా 3,800 పైచిలుకు ఉద్యోగాలు ఇప్పించినట్లు వివరించారు.
కోల్ ఇండియాలో లేని హక్కులను తమ గౌరవ అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అమలు చేయించినట్లు చెప్పారు. అలాంటిది తమ సంఘాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఆ నాయకుల కుట్రలను సింగరేణి కార్మిక వర్గం తిప్పికొడుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు దేవ వెంకటేశం, బీ శంకర్‌నాయక్, ఎట్టం కృష్ణ, నాయిని మల్లేశ్, అక్రమ్, బనాకర్, సిరంగి శ్రీనివాస్, బీ మల్లికార్జున్, బేతి చంద్రయ్య, ముస్కుల అనిల్ రెడ్డి, హరిప్రసాద్, తిరుపతి, నరసయ్య, బాబురావు, ఆవుల రాములు, సిరిశెట్టి రాములు, శ్రీకాంత్, సంపత్‌రెడ్డి, మహేందర్, సంపత్, నరసింహ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.