ఉట్నూర్, ఏప్రిల్ 25 : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వచ్చే సంవత్సరం నుంచి ఆంగ్ల బోధనను ప్రారంభిస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినాజడ్ చోంగ్తూ అన్నారు. ఉట్నూర్ పర్యటనలో భాగంగా వచ్చిన ఆమె, సోమవారం ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఆంగ్ల బోధన ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆంగ్లంపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణను ప్రారంభించినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు పాటిజివ్ దృక్పథం కలిగి ఉండాలని, వయస్సుతో సంబంధం లేకుండా నైపుణ్యాలు పెంపొదించుకోవాలని సూచించారు. అంతకుముందు కరాడీపాత్లో భాగంగా ఆంగ్లభాషపై శిక్షణ విజయవంతం అయిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని ఆమె కోరారు.
నృత్య పాఠశాల సందర్శన..
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు సంస్కృతీసంప్రదాయాలు నేర్పేందుకు ఏర్పాటు చేసిన గుస్సాడీ నృత్య పాఠశాలను ఆమె సందర్శించారు. గిరిజన విద్యార్థులు సంస్కృతీసంప్రదాయాలపై పట్టు సాధించేలా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసుల వినతి..
దేశంలోని గోండులకు ప్రత్యేక కాలం కేటాయించాలని కోరుతూ కమిషనర్‌కు ఆదివాసులు కోరెంగ దౌలత్‌రావు, మెస్రం దుర్గు వినతి పత్రం సమర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో గిరిజనులకు కాలం నమోదు చేసేవారని తెలిపారు. కానీ, ఆ తర్వాత అది అమలుచేయకపోవడంతో గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందక ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. వారి వెంట నాయకులు మంగం విషంరావు, హన్మంత్‌రావు, నిరంజన్, కుమ్రం బండేరావు పాల్గొన్నారు.
నాల్గోతరగతి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో
అలాగే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐటీడీఏ నాల్గోతరగతి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమాల్లో పనిచేస్తున్న కుక్, కామాటి, వాచ్‌మన్, డెయిలీవేజ్ వర్కర్లు, పార్ట్‌టైం వర్కర్లకు జీతాలు తక్కువగా ఉన్నాయన్నారు. వాటిని కలెక్టర్ ఆర్డర్ ప్రకారం రోజుకు రూ.590కి పెంచాలని, రెండు జతల దుస్తులు అందించాలని, జీవో ఎంఎస్ 16 ప్రకారం ఐటీడీఏ పీవో కార్యాలయంలో పనిచేస్తున్న వర్కర్లకును రెగ్యులర్ చేయాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేబీసీ నారాయణ, జిల్లా అధ్యక్షుడు షౌకత్ హుస్సే న్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిడాం శ్రీనివాస్, కేంద్రె వినాయక్, కమల, మల్కు, జంగు, సోనేరావు, బాలాజీ, ఈరమ్మ, అశోక్, నితిన్, గోద్రు, చందు, మారుతి, తొడసం రంభ పాల్గొన్నారు.