రైతు అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయాల్సి ఉన్నా.. మోదీ సర్కారు తెలంగాణ రైతుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నది. అన్నదాతలు ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలు దళారులకు అమ్మి నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే వానకాలం పంటలను సేకరించిన ప్రభుత్వం, యాసంగి పంటలను కొనుగోలు చేస్తున్నది. శనగ పంటకు క్వింటాలు మద్దతు ధర రూ.5,230తో సేకరిస్తున్నది. డబ్బులు కూడా వెంటవెంటనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయగా.. ఇప్పటి వరకు రూ.49.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, కంది, సోయా పంటలను, యాసంగిలో శనగ, గోధుమ, జొన్న పంటలను పండిస్తారు. వానకాలంలో పత్తిని ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.10 వేల వరకు చెల్లించి కొనుగోలు చేశారు. సో యా, కందులను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో సేకరించింది. యాసంగిలో జిల్లాలో 76 వేల ఎకరాల్లో రైతులు శనగ పంటను వేశారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల పంట చేతికి వచ్చింది. ప్రభుత్వం ఈ ఏడాది శనగ క్వింటాలుకు రూ.5,230 మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారులు రూ.4,750తో కొనుగోలు చేస్తుండడంతో రై తులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు జిల్లాలోని 9 మార్కెట్‌యార్డుల్లో మా ర్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1.63 లక్షల క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు.
రూ.49.47 కోట్లు విడుదల..
జిల్లాలో శనగల కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నది. ఇప్పటివరకు 94,610 క్వింటాళ్లకు సంబంధించిన రూ. 49.47 కోట్లను విడుతల వారీగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 8న 40,146 క్వింటాళ్ల డబ్బులు రూ.20.99 కోట్లు, సోమవారం 54,464 క్వింటాళ్ల పైసలు రూ.28.48 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో విడుత డబ్బులను నేటి నుంచి ఖాతాల్లో వేయస్తామన్నారు. 53,678 క్వింటాళ్ల డబ్బులు రూ.28.07 కోట్లు త్వరలో విడుదల కానున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో రైతులందరికీ డబ్బులు..
జిల్లాలో ఈ ఏడాది 1.63 లక్షల క్వింటాళ్ల శనగ పంటను మద్దతు ధర క్వింటాలుకు రూ.5,230తో కొనుగోలు చే శాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు విడుతలుగా రూ. 49.47 కోట్లను విడుదల చేసింది. మొదటి విడుత డబ్బులు రూ.20.99 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రెండో విడత వచ్చిన పైసలు రూ. 28.48 కోట్లను నేటి నుంచి అకౌంట్లలో వేస్తాం. పంటను విక్రయించిన రై తులందరికీ డబ్బులు చెల్లిస్తాం. ఎవరూ ఆందోళన పడద్దు.
– పుల్లయ్య, మార్క్‌ఫెడ్ మేనేజర్, ఆదిలాబాద్