నిర్మల్,ఏప్రిల్18( నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రూ.5కోట్ల నిధులతో నిర్మల్‌లో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని సోమవారం స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఎన్టీఆర్ మినీ ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని, టీఆర్ఎస్ పాలనలోనే వారి కల సాకారమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు.
రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన రాష్ర్టానికే ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరిగాయన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతున్నదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో ఎస్సీలకు కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేసేలా ఎస్సీ డెవలప్మెంట్ యాక్ట్‌ను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గత ఏడేళ్లలో వెయ్యికి పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా స్కూళ్లలో నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకున్నారని తెలిపారు. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచి, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గత ఎనిమిదేళ్లలో నయా పైసా కేటాయించలేదని మండిపడ్డారు.
30ఏండ్ల కల సాకారమైంది:మంత్రి అల్లోల
నిర్మల్‌లో అంబేద్కర్ భవనం నిర్మాణంతో దళితుల 30 ఏండ్లుగా కల సాకారమైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరువాత ఇంత పెద్ద భవనం మరెక్కడా లేదని, కేవలం నిర్మల్‌లో మాత్రమే ఉందన్నారు. రూ. 5 కోట్లతో దీన్ని నిర్మించినట్లు చెప్పారు. వివిధ కార్యక్రమాలు, ఇతర సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ అంబేద్కర్ ఆడిటోరియం ఎంతో ఉపయోగ పడుతుందున్నారు. కాగా దళిత విద్యార్థుల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మంత్రి అల్లోల కోరారు.
ఇందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మంత్రులను ఘనంగా సత్కరించారు. అలాగే గడువులోగా అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టర్లు లక్కడి జగన్మోహన్ రెడ్డి, జైపాల్‌రెడ్డిలను మంత్రులు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కాడే, రాంబాబు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వి. రాజేశ్వర్‌గౌడ్, దళిత సంఘాల నాయకులు ముడుసు సత్యనారాయణ, డీ రాములు, వెంకటస్వామి, పీ రాజేశ్వర్, బొడ్డు లక్ష్మణ్, ఎన్.ప్రసాద్, ప్రభాకర్, మెట్టు గంగాధర్, గాడ్పాలే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.