నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల బలోపేతం కోసం మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మౌలిక సదుపాయలు కల్పిస్తూ ప్రతీ విద్యార్థికి నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 260 పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. నిర్మల్ మండలం ఎల్లపెల్లి పాఠశాల (రూ.11 లక్షలతో) అభివృద్ధి పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు.
నివేదికలు సిద్ధం..
జిల్లాలోని 19 మండలాల్లో ఎంపికైన 159 ప్రాథమిక, 29 ప్రాథమికోన్నత, 72 ఉన్నత పాఠశాలల్లో అభివృద్ధి పనులకు అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 2019లో జిల్లాలోని ఆయా పాఠశాల అభివృద్ధికి కావాల్సిన వివరాలను యూడైస్‌లో పొందుపర్చారు. దాని ఆధారంగా మానిటరింగ్ బృందం సభ్యులు పాఠశాలలను సందర్శించి, నివేదికలను తయారుచేస్తున్నారు. 260 పాఠశాలల్లో 162 పాఠశాలలకు రూ.7,85,86,918 నిధులు ఖర్చవుతాయని ప్రాథమికంగా గుర్తించారు. మిగతా పాఠశాలల నివేదికలను అధికారులు రూపొందిస్తున్నారు.
ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు..
‘మన ఊరు మన బడి’ ద్వారా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు నివేదికలను సిద్ధం చేస్తూ పలు చోట్ల పనులను ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లపెల్లి గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి ఐకే రెడ్డి శంకుస్థాపన చేశారు. ముథోల్ నియోజకవర్గంలోని బాసరలో పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద మొదటి విడుతలో ఎంపికైన 260 పాఠశాలల్లో 12 రకాల అభివృద్ధి పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నారు.
కొత్త విద్యా సంవత్సరానికి పనులు పూర్తి..
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా నిర్మల్ జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత మొత్తం 260 పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ పాఠశాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నివేదికలను పొందుపరుస్తున్నాం. కొత్త విద్యాసంవత్సరానికి పనులను పూర్తి చేస్తాం.
– రవీందర్, డీఈవో, నిర్మల్ జిల్లా