కోటపల్లి/కౌటాల/వేమనపల్లి, ఏప్రిల్ 13;ప్రాణహిత పుష్కర ఘట్టం ఆవిష్కృతమైంది. పన్నెండు రోజుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు దేవగురు బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న వేళ వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. వేమనపల్లి వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. సాయంత్రం 6.30 గంటలకు హారతి కార్యక్రమం నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాలను బుధవారం మధ్యాహ్నం 3:50 గంటలకు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతీ హోళికేరి ప్రారంభించారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మంత్రి, విప్ కూడా పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం నదిలో ఈదుతూ ఉత్సాహంగా గడిపారు. తెలంగాణతోపాటు ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి పిండాప్రదానాలు చేశారు. ఏర్పాట్లను కలెక్టర్ భారతీ హోళికేరి, డీసీపీ అఖిల్ మహజన్ పరిశీలించారు.
బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి, ప్రభుత్వ విప్ ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 6:30 గంటలకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ విప్ నల్లాల ఓదెలు, డీపీవో నారాయణ రావ్, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు, చెన్నూర్ మున్సిపల్ చైర్మన్ అర్చన రాంలాల్ గిల్డా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, సర్పంచ్ గుర్రం లక్ష్మి పాల్గొన్నారు.
తుమ్మిడిహట్టి వద్ద ఎమ్మెల్యేలు కోనప్ప, సక్కు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రాణహిత పుష్కరాలకు అంకురార్పణ చేశారు. సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కులు ప్రారంభించి, కుటుంబ సమేతంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పూజా కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి పాల్గొనగా.. ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా అక్కడే ఉన్న గలకుసంత్ శ్రీ కార్తీక్ మహారాజ్ ఆలయంలో పూజలు చేశారు.
కోనప్ప భక్తులకు అన్నదానం చేశారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు పుష్కర సంబురాలు కొనసాగనున్నట్లు వేదపండితులు తెలిపారు. ఈ పుష్కర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. పుష్కరాల్లో ఎంపీపీ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపాల్ వైస్ చైర్మన్ గిరీశ్, పుష్కరఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా, ఎంపీడీవో నస్రూల్ల ఖాన్, తహసీల్దార్ రాంలాల్, ఎంనీఓ శ్రీధర్ రాజు పాల్గొన్నారు.
వేమనపల్లి వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య..
మంచిర్యాల జిల్లా వేమనపల్లి సమీపంలో ప్రాణహిత పుష్కరాలను బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నదికి హారతి ఇచ్చి ప్రారంభించారు. అంతకుముందు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. మొదటి రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 12 రోజులపాటు జరిగే పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచిం చారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుమాధవ్‌రావు, ఎంపీపీ ఆత్రం గణపతి, సర్పంచ్ మధూ కర్, భీమిని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నిరంజన్ గుప్తా, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, నెన్నెల మండల అధ్యక్షు డు భీమాగౌడ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ భీమన్న పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాలను తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో అనిల్‌కుమార్, డీఎల్పీవో ఫణీందర్, ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు అంజన్‌కుమార్, నరేశ్ పర్యవేక్షించారు. ఎస్ఐ నరేశ్ పుష్కర ఘాట్ వద్ద బందోబస్తు నిర్వహించారు. కాగా.. ఘాట్ వద్ద జడ్పీటీసీ స్వర్ణలత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అంబులెన్స్ కేటాయింపు
వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108 వాహనాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ తెలిపారు. బుధవారం ఆయన 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.