సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 13: అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సీసీసీ సింగరేణి అతిథి గృహంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతీ హోళీకేరితో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంచులు, రవాణా, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైస్‌మిల్లరు, ట్రాన్స్పోర్ట్ యజమానుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాల వివరాలు, అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ యాసంగిలో రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలని కేంద్రంపై పోరాటం చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని విస్మరించడంతో వడ్లు కొనుగోలు చేయాలని క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.
జిల్లాకు 36 లక్షల గోనె సంచులు కావాలని, వాటి కొరత లేకుండా చూస్తామని, ట్రాన్స్పోర్ట్ యజమానులు, రైస్‌మిల్లర్లు సహకరించాలని కోరారు. గత సీజన్ కంటే యాసంగిలో పంట సాగు తగ్గిందని, రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీసీపీ అఖిల్ మహాజన్, జిల్లా ఫారెస్ట్ అధికారి శివాని డోగ్రె, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్మాసు కాంతయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మోటపలుకుల గురువయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.