ఇచ్చోడ, ఏప్రిల్ 13 : పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడం జిల్లాకే గర్వకారణమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ముక్రా(కే) గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడంపై బుధవారం సర్పంచ్ గాడ్గె మీనాక్షిని స్వయంగా కలెక్టరేట్‌కు పిలిపించుకున్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మిగతా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పాలక వర్గ సభ్యులు ముక్రా(కే) జీపీని ఆదర్శంగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ముక్రా(కే) ఎంపీటీసీ గాడ్గె సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
ఎదులాపురం, ఏప్రిల్ 13 : విపత్తు స్పందన, అగ్ని మాపక సేవ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు కొనసాగుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల నిర్వహణ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల కరపత్రాలను కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఎఫ్‌వో కే కేశవులు, ఎస్ఎఫ్వో శివాజీ, సిబ్బంది విడుదల చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సూపరింటెండెంట్ బీ ప్రవీణ్ కుమార్, సినీయర్ అసిస్టెంట్ రహీమ్ ఉద్దీన్, ఎల్ఎఫ్ సీహెచ్ కాంతారావు, సిబ్బంది పాల్గొన్నారు.